పొన్నియన్ సెల్వన్.. అంతా ఓకే కానీ


తమిళ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. సెప్టెంబరు 30న ఈ చిత్రం రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రెండు దశాబ్దాల నుంచి చేయాలని చూస్తున్న కలల ప్రాజెక్టు ఇది. గతంలో ఈ సినిమా కోసం సన్నాహాలు చేసి వెనక్కి తగ్గాడు. ఎట్టకేలకు తన డ్రీమ్ ప్రాజెక్టులో ఒక పార్ట్ పూర్తి చేసి రిలీజ్‌కు రెడీ చేశాడు. లైకా ప్రొడక్షన్స్ సహకారంతో తన సొంత బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మించాడు మణిరత్నం. నిన్ననే ‘పొన్నియన్ సెల్వన్’ టీజర్ కూడా పలు భాషల్లో లాంచ్ అయింది. అందులో కనిపించిన భారీ విజువల్స్, సెట్టింగ్స్, తారాగణం.. వారి కాస్ట్యూమ్స్.. అన్నీ కూడా అమితంగా ఆకట్టుకున్నాయి. సినిమా మీద అంచనాలు పెంచాయి. మణిరత్నం ఈ సినిమాతో గట్టిగా బౌన్స్ బ్యాక్ అవుతాడని.. తమిళ ఇండస్ట్రీకి ఇక బాహుబలి లాంటి సినిమాను అందిస్తాడని ఆయన అభిమానులు ధీమాగా ఉన్నారు.

కాకపోతే ‘పొన్నియన్ సెల్వన్’కు సంబంధించి ఓ పెద్ద సమస్య ఉంది. అదే.. నేటివిటీ. ఈ సినిమా కల్పిత కథతో తెరకెక్కింది కాదు. ఒకప్పుడు తమిళనాడు సహా పలు ప్రాంతాలను ఏలిన చోళ రాజుల కథనే ఈ సినిమాలో చూపిస్తున్నాడు మణిరత్నం. తమిళ లెజెండరీ రైటర్ కల్కి రాసిన పుస్తకం ఆధారంగా ఆయనీ సినిమా తీశారు. మణిరత్నం అనే కాదు.. ఏ తమిళ దర్శకుడు ఓ భారీ చిత్రం తీసినా.. వాళ్ల నేటివిటీని గట్టిగా దట్టించేస్తారు. దీని వల్ల తమిళ ప్రేక్షకులకు అది బాగా రుచించినా.. వేరే ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోతుంటారు. ఇలాంటి భారీ సినిమాలు తీసేటపుడు ఇతర భాషల ప్రేక్షకులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

నేటివిటీ ఫ్యాక్టర్ మరీ శ్రుతి మించకుండా చూసుకోవాలి. టైటిల్, పాత్రల పేర్లు స్థానికంగా కనెక్ట్ అయ్యేలా కొంచెం మార్చాల్సి ఉంటుంది. బాహుబలి దేశవ్యాప్తంగా అందరికీ రీచ్ అయిందంటే.. ఎవరికి వాళ్లు తమ ప్రాంతంలో జరిగిన కథలా ఫీలవ్వడమే కారణం. అది కల్పిత కథ కాబట్టి దానికి పరిమితులు ఉండవు. ఇది భిన్నం కదా అనవచ్చు. కానీ ‘ఆర్ఆర్ఆర్’లో తెలుగు గడ్డపై నడయాడిన నిజ జీవిత పాత్రలనే తీసుకుని అందరికీ కనెక్ట్ అయ్యేలా చూపించాడు రాజమౌళి.ఎక్కువ మందికి సినిమా రీచ్ కావాలంటే ఇలాంటి వెసులుబాటు అవసరం.

‘పృథ్వీరాజ్’ సినిమాను ఇతర భాషల వాళ్లు కనీసం పట్టించుకోకపోవడానికి కూడా నేటివిటీ ఫ్యాక్టర్ మైనస్ కావడమే కారణం. స్థాయిక కథలను కూడా వేరే వాళ్లకు కనెక్ట్ అయ్యేలా చూపించడంలోనే నైపుణ్యం ఉంటుంది. మణిరత్నం ఆ పని చేసినట్లుగా కనిపించడం లేదు. ఇతర భాషలకు కనీసం టైటిల్ మార్చలేదు. పాత్రల పేర్లను కూడా తమిళంలోనే పెట్టి క్యారెక్టర్ పోస్టర్లు రిలీజ్ చేశాడు. ప్రతి సినిమాలోనూ తమిళ నేటివిటీని దట్టించడం ఒకప్పుడు బలమైందేమో కానీ.. పాన్ ఇండియా రీచ్ చాలా కీలకంగా మారిన ఈ రోజుల్లో అదే వాటికి మైనస్ అవుతోంది. మరి ‘పొన్నియన్ సెల్వన్’ తమిళ బంధనాల్ని తెంచుకుని ఇతర భాషల వాళ్లను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.