రాజా సుహల్ దేవ్ గా చరణ్ ?

ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా పుట్టిందో కానీ ఎప్పుడో వెయ్యి సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన రాజు సుహల్ దేవ్ పాత్రను తెరకెక్కించే ఉద్దేశంతో ఓ ప్రొడక్షన్ కంపెనీ రామ్ చరణ్ ను కలిసిందన్న వార్త ముంబై మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆర్ఆర్ఆర్ వచ్చినప్పటి నుంచి ముంబై పత్రికల్లో వెబ్ సైట్స్ లో మెగా పవర్ స్టార్ పేరు బాగా నానుతోంది. దానికి తోడు శంకర్ తో చేస్తున్న సినిమా కూడా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఏదో ఒక రూపంలో కవరేజ్ కంటిన్యూగా దక్కుతోంది. నెట్ ఫ్లిక్స్ లో ట్రిపులార్ వచ్చాక ఇంకా ఎక్కువయ్యింది.

ఒకవేళ ఇది కాసేపు నిజమే అనుకుందాం. కానీ సుహల్ దేవ్ కు ఎంత అద్భుతమైన నేపథ్యం ఉన్నప్పటికీ ఆ కథను ఇప్పటి జెనరేషన్ కు కనెక్ట్ అయ్యేలా చెప్పడం చాలా కష్టం. 1033లో ఘాజి మియన్ దండయాత్ర చేసినప్పుడు సామంత రాజులందరూ అతనికి తలొగ్గితే సుహల్ దేవ్ ఒక్కడే ఎదురొడ్డి వాళ్ళను మట్టుబెడతాడు. ఆ తర్వాత అదే మియన్ దగ్గర కమాండర్ గా పని చేసిన సయ్యద్ ఇబ్రహీం చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. ఈ క్రమంలో ఎన్నో ఉత్కంఠభరిత సంఘటనలు, ఊహకందని మలుపులు జరుగుతాయి. అవన్నీ సుహల్ గొప్పదనాన్ని చాటేవే.

అసలే చారిత్రక పురుషుల గాథల పట్ల మనమే కాదు నార్త్ ఆడియన్స్ కూడా ఏమంత ఆసక్తి చూపించడం లేదు. సామ్రాట్ పృథ్విరాజ్ ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. మణికర్ణిక ఏదో పర్లేదనిపించింది కానీ అద్భుతాలు చేయలేదు. గౌతమి పుత్రశాతకర్ణి హిట్ అయినా బాలయ్య రేంజ్ లో ఆడలేదు. కమర్షియల్ అంశాలు ఎక్కువ చూపించే అవకాశం లేకుండా డ్రామాని బ్యాలన్స్ గా నడిపించే ఒత్తిడి ఉండటంతో దర్శకులు ఫాంటసీని జోడించలేక తడబడుతున్నారు. మరి చరణ్ ఇలాంటి ట్రెండ్ లో రిస్క్ చేసి ఓకే చెప్పడం అనుమానమే.