వేసవి చివర్లో మేజర్, విక్రమ్ లాంటి సూపర్ హిట్ లతో ఆ సీజన్‌కు మంచి ముగింపు లభించింది. కానీ తర్వాతి నెల రోజుల్లో ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు. గత వారం వచ్చిన ‘పక్కా కమర్షియల్’ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వీకెండ్లో రిలీజ్ అవుతున్న ఒక చిన్న సినిమా మీద టాలీవుడ్ ఆశలు పెట్టుకుంది. అదే.. హ్యాపీ బర్త్ డే. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో ‘మత్తు వదలరా’ దర్శకుడు రితేష్ రానా రూపొందించిన చిత్రం ఇది.
మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో ఆ సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తూ వచ్చిన చెర్రీ నిర్మాతగా మారి ‘క్లాప్ ఎంటర్టైన్మెంట్’ బేనర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించాడు. ‘సర్రియల్ కామెడీ’ అంటూ లాజిక్స్‌తో సంబంధం లేకుండా క్రేజీ క్రేజీగా సాగే వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మధ్య కాలంలో ఏ చిన్న సినిమాకూ లేని విధంగా వెరైటీ ప్రమోషన్లతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించగలిగింది.
కాకపోతే కొవిడ్ తర్వాత చాలా సెలక్టివ్‌గా థియేటర్లకు వస్తున్న ప్రేక్షకులు.. ‘హ్యాపీ బర్త్‌డే’ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అంతంతమాత్రంగానే స్పందించారు. ఈ నేపథ్యంలో సినిమాకు టాక్ చాలా కీలకంగా మారబోతోంది. సినిమా బాగుందంటే.. మ్యాట్నీ నుంచే పుంజుకునే అవకాశాలున్నాయి. ఫస్ట్ షో నుంచి పరిస్థితి బాగుంటుంది. టాక్ అటు ఇటు అయితే చాలా కష్టమవుతుంది.
ప్రోమోలతో బాగా ఆసక్తి రేకెత్తించడంతో ఇండస్ట్రీ జనాలు కూడా ‘హ్యాపీ బర్త్ డే’ మీద ప్రత్యేక ఆసక్తితో ఉన్నారు. ఈ జానరేంటి.. స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతోంది అనే క్యూరియాసిటీ అందరిలో కనిపిస్తోంది. ‘మత్తు వదలరా’ తర్వాత రితేష్ రాణా ఈసారి ఎలా తన టాలెంట్ చూపించాడని కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
ఇక కెరీర్లో ఒక స్థాయికి మించి ఎదగలేక, కొన్నేళ్ల నుంచి సరైన సినిమా పడక లైమ్ లైట్లో లేకుండా పోయిన లావణ్యకు ఈ సినిమా సక్సెస్ కావడం చాలా కీలకం. మరి ‘హ్యాపీ బర్త్ డే’ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి. ఈ చిత్రంతో పాటు గంధర్వ, మా నాన్న నక్సలైట్ అనే చిన్న సినిమాలతో పాటు డబ్బింగ్ మూవీస్ కడువా, మయోస్ కూడా ఈ వీకెండ్లోనే ప్రేక్షకుల ముందుకొస్తున్నప్పటికీ వాటికి అంతగా బజ్ కనిపించడం లేదు.