పండుగ తెస్తే.. రామ్‌యే తేవాలి

ఈ ఏడాది సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ కళ తప్పింది. కొవిడ్ మూడో వేవ్ విజృంభణతో ఆ పండక్కి షెడ్యూల్ అయిన పెద్ద సినిమాలన్నీ వాయిదా పడిపోవడమే అందుక్కారణం. ఐతే వేసవి మాత్రం చాలా సందడిగా సాగింది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 వసూళ్ల మోత మోగించాయి. సర్కారు వారి పాట, ఎఫ్-3 లాంటి చిత్రాలు ఓపెనింగ్స్ వరకు బాగానే రాబట్టాయి. సీజన్ చివర్లో మేజర్, విక్రమ్ చిత్రాలు మురిపించాయి. మొత్తంగా వేసవి సంతృప్తికరమే. కానీ సమ్మర్ సీజన్ ముగియగానే టాలీవుడ్ బాక్సాఫీస్ డల్లయింది.

జూన్ రెండో వారం నుంచి ఏ సినిమా కూడా సరిగా ఆడలేదు. టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఓపెనింగ్స్ లేవు. సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి తప్పితే థియేటర్లలో సందడి లేదు. గత వారాంతంలో రిలీజైన ‘పక్కా కమర్షియల్’కు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు చాలా ఆశాజనకంగా కనిపించాయి కానీ.. ఆ సినిమా ఉపయోగించుకోలేకపోయింది. బ్యాడ్ టాక్‌తో మొదలై వీకెండ్లో కూడా సత్తా చాటలేక చతికిలపడింది.

ఈ వారం ‘హ్యాపీ బర్త్ డే’ సినిమా రిలీజవుతోంది. ఇది ఓ వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సందడి తీసుకొచ్చే చిత్రంలా అయితే కనిపించడం లేదు. మాస్ ప్రేక్షకులకు ఆ సినిమా మీద ఆసక్తి కనిపించడం లేదు. మొత్తంగా చూస్తే బాక్సాఫీస్ స్లంప్ ఈ వారం కూడా కొనసాగే లాగే కనిపిస్తోంది. ఐతే వచ్చే వారం రాబోతున్న రామ్ సినిమా ‘ది వారియర్’ మాత్రం ఆశలు రేకెత్తిస్తోంది. మళ్లీ మాస్‌ను థియేటర్లకు రప్పించే సినిమాగా దీన్ని చెప్పొచ్చు.

ఇస్మార్ట్ శంకర్, రెడ్ చిత్రాల తర్వాత రామ్ చేసిన సినిమా కావడం.. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి ఈ చిత్రాన్ని రూపొందించడం, ట్రైలర్ మాస్ మసాలా అంశాలతో నిండి ఉండడంతో ఇటు ప్రేక్షకుల్లో, అటు ట్రేడ్‌లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కచ్చితంగా మళ్లీ హౌస్ ఫుల్స్ బోర్డులు పెట్టించే సినిమాలా కనిపిస్తోందిది. అడ్వాన్స్ బుకింగ్స్, ఓపెనింగ్స్ విషయంలో జోరు కనిపించవచ్చు. టాక్ కూడా బాగుంటే రామ్ తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టడమే కాక.. మళ్లీ థియేటర్లలో సందడి తెచ్చిన వాడవుతాడు.