తమిళ్ రాకర్స్.. ఈ పేరు వినగానే సౌత్ ఇండియాలో బాగా ఫేమస్ అయిన పైరసీ వెబ్ సైట్ పేరు గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఈ పేరుతో ఒక వెబ్ సిరీస్ రాబోతుండడం విశేషం. ఇదేమీ కామెడీగా సాగే పేరడీ వెబ్ సిరీస్ ఏమీ కాదు. చాలా సీరియస్‌గా సాగే థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీన్ని రూపొందిస్తున్నది తమిళంలో ప్రముఖ దర్శకుడైన అరివళగన్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ శిష్యుడైన ఇతను.. ఈరం (తెలుగులో వైశాలి) అనే సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఇంకో మూడు హిట్ సినిమాలు తీశాడు. ఇప్పుడతను సోనీ లివ్ కోసం తమిళ్ రాకర్స్ పేరుతో వెబ్ సిరీస్ తీస్తున్నాడు. ఏవీఎం లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ సిరీస్‌ను నిర్మించడం విశేషం.
తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన అరుణ్ విజయ్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. అరివళగన్, అరుణ్ కలిసి గతంలో కుట్రం 23 అనే సూపర్ హిట్ సినిమా చేశారు. తర్వాత వీరి కలయికలో బోర్డర్ అనే సినిమా కూడా తెరకెక్కింది. ఇప్పుడీ ఇద్దరూ కలిసి తమిళ్ రాకర్స్ పేరుతో వెబ్ సిరీస్ చేస్తున్నారు. పైరసీ వెబ్ సైట్ పేరు మీద సిరీస్ కావడంతో ఇందులో ఏం చూపిస్తారా అన్నది ఆసక్తికరం. సినిమాల పైరసీ నేపథ్యంలో తెరకెక్కే క్రైమ్ సిరీస్ కావచ్చిది.
తమిళ్ రాకర్స్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండియాలో ఏ కొత్త సినిమా రిలీజైనా కొన్ని గంటల్లో పైరసీ ప్రింట్ ఈ వెబ్ సైట్లో ప్రత్యక్షమవుతుంది. ప్రధానంగా తమిళ సినిమాల మీదే ఈ సంస్థ ఫోకస్ ఉంటుంది కానీ.. వేరే భాషల చిత్రాలను కూడా పైరసీ చేసి ఇంటర్నెట్లో పెట్టేస్తుంటుంది ఈ సంస్థ. దీని అడ్మిన్ ఎక్కడో విదేశాల్లో ఎవరికీ దొరక్కుండా సర్వర్ మెయింటైన్ చేస్తూ.. కొత్త సినిమాలను పైరసీ చేస్తుంటాడు. ఈ వెబ్ సైట్‌ను నియంత్రించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఆ వెబ్ సైట్‌ను నిషేధిత జాబితాలో పెట్టి అది పని చేయకుండా చేసినా.. తన సబ్‌స్క్రైబర్లకు మెయిల్ ద్వారా పైరసీ లింక్స్ పంపిస్తూ.. ఈ బిజినెస్‌ను విజయవంతంగా నడిపిస్తున్నారు.