చిరుకు విల‌న్‌గా మ‌ల‌యాళ న‌టుడు

ఆచార్య‌తో గ‌ట్టి షాకే తిన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇన్నేళ్ల కెరీర్లో చిరుకు డిజాస్ట‌ర్లు లేక కాదు కానీ.. ఈ సినిమా క‌నీసం స‌రైన‌ ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోక‌పోవ‌డం, ఆయ‌న చిత్రాల్లో అత్యధిక న‌ష్టాలు తెచ్చిపెట్టిన సినిమాగా నిల‌వ‌డం, టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద డిజాస్ట‌ర్ల‌లో ఒక‌టవ‌డం జీర్ణించుకోలేని విష‌య‌మే. ఈ నేప‌థ్యంలో త‌ర్వాతి సినిమాల విష‌యంలో ఏ చిన్న త‌ప్పూ జ‌ర‌గ‌కూడ‌ద‌ని, త‌మ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు ఉండాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

చిరు కొత్త‌గా న‌టిస్తున్న మూడు చిత్రాల్లో రెండు (గాడ్ ఫాద‌ర్‌, బోళా శంక‌ర్) రీమేక్‌లే కావ‌డంతో వీటి ప‌ట్ల ఆస‌క్తి కొంచెం త‌క్కువ‌గానే ఉంది. వీటితో పోలిస్తే బాబీ డైరెక్ష‌న్లో చిరు చేస్తున్న వాల్తేరు వీర‌య్య (వ‌ర్కింగ్ టైటిల్‌) మీద ఎక్కువ అంచ‌నాలున్నాయి. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌లే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రావ‌డం తెలిసిందే.

చిరు స‌ర‌స‌న శ్రుతి హాస‌న్ న‌టిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్‌ను ఢీకొట్టే విల‌న్ ఎవ‌ర‌న్న‌ది ఇప్ప‌టిదాకా వెల్ల‌డి కాలేదు. ఇందుకోసం ర‌క‌ర‌కాల ప్ర‌త్యామ్నాయాలు ప‌రిశీలించి చివ‌రికి మ‌ల‌యాళ న‌టుడు బిజు మీన‌న్‌ను ఓకే చేసిన‌ట్లు స‌మాచారం. బిజు తెలుగు సినిమాల్లో విల‌న్‌గా న‌టించ‌డం కొత్తేమీ కాదు. అత‌ను ర‌ణంతో విల‌న్‌గా ప‌రిచ‌యం అయ్యాడు. ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత ఖ‌త‌ర్నాక్ మూవీలోనూ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించాడు. అది డిజాస్ట‌ర్ అయ్యాక ఆయ‌న్ని ఎవ‌రూ సంప్ర‌దించ‌లేదు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా భీమ్లా నాయ‌క్ ఒరిజిన‌ల్ అయ్య‌ప్ప‌నుం కోషీయుంలో త‌న పాత్ర చేసింది బిజునే. ఆ పాత్ర‌కు చాలా మంచి అప్లాజ్ వ‌చ్చింది. మ‌ల‌యాళంలో ప్ర‌స్తుతం టాప్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల్లో బిజు ఒక‌డు. ఆయ‌నకు న‌టుడిగా అక్క‌డ గొప్ప పేరే ఉంది. అలాంటి న‌టుడు చిరుకు విల‌న్‌గా న‌టిస్తే క్లాష్ భ‌లేగా ఉంటుంది. బిజు పాత్ర బాగుంటే చిరు కూడా బాగా ఎలివేట్ అవ్వ‌డానికి అవ‌కాశ‌ముంటుంది.