టాలీవుడ్లో చాలామంది సీనియర్ నిర్మాతలు కనుమరుగైపోయారు. పెద్ద బేనర్లు ప్రొడక్షన్ ఆపేశాయి. కానీ చాలా కొద్ది మంది నిన్నటితరం నిర్మాతలు మాత్రమే ఇంకా యాక్టివ్‌గా ఉన్నారు. సినిమాలు తీస్తున్నారు. అందులో అల్లు అరవింద్ ఒకరు. ఆయన మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ఉంటారు. బన్నీ వాసు లాంటి యంగ్ ప్రొడ్యూసర్‌ని చేరదీసి తన బేనర్ వ్యవహారాలన్నీ అప్పగించారు. యంగ్ టీమ్స్‌తో పని చేయడం ద్వారా తనను తాను అప్‌డేట్ చేసుకుంటూ ఇంకా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు.
సొంతంగా సినిమాలు ప్రొడ్యూస్ చేయడంతో పాటు అప్పుడప్పుడు వేరే వాళ్ల చిత్రాలను కూడా గీతా ఆర్ట్స్ బేనర్ ద్వారా అరవింద్ రిలీజ్ చేస్తుంటారు. ఈ కోవలోనే ఆయన యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం చిత్రం ‘సమ్మతమే’ను తన బేనర్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఐతే ఇంకో వారం రోజుల్లో అరవింద్ సొంత సినిమా ‘పక్కా కమర్షియల్’ రిలీజవుతుండగా.. ఇప్పుడు బయటి సినిమాను తన బేనర్లో రిలీజ్ చేయడం, తమ థియేటర్లను వాటికి కేటాయించడం ఇండస్ట్రీ చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఐతే అరవింద్ ఎందుకిలా చేస్తున్నారో బన్నీ వాసు ‘సమ్మతమే’ ప్రి రిలీజ్ ఈవెంట్లో వెల్లడించారు. ‘సమ్మతమే’ సినిమా టీం తమను కలిసి మంచి సినిమా చేశాం ఒకసారి చూడండని అడిగితే తాను చూశానని.. ఇలాంటి సినిమాకు సపోర్ట్ చేయాలనిపించి అరవింద్ గారికి చెబితే.. ఆయన వాళ్లకు అండగా నిలవడానికి ముందుకు వచ్చారని బన్నీ వాసు తెలిపాడు. వారంలో తమ సినిమా రిలీజవుతుండగా.. ఇంకో సినిమాకు తమ థియేటర్లను కేటాయించడం రిస్కే అయినా.. చిన్న సినిమాల రిలీజ్ చాలా కష్టం అయిపోతున్న నేపథ్యంలో ‘సమ్మతమే’ లాంటి మంచి చిత్రానికి సపోర్ట్ ఇవ్వాలనిపించి అరవింద్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాసు వెల్లడించాడు.
ఐతే ‘సమ్మతమే’ను గీతా ఆర్ట్స్‌లో రిలీజ్ చేయడంలో అరవింద్ స్వార్థం కూడా కొంత ఉంది. కిరణ్ తర్వాతి సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ను నిర్మిస్తున్నది గీతా ఆర్ట్సే. దాని కంటే ముందు వచ్చే సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నందుకుంటే.. తమ చిత్రానికి ప్లస్ అవుతుంది. కిరణ్ ఆల్రెడీ ‘సెబాస్టియన్’తో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు. ఇది కూడా తేడా వస్తే ‘వినరో భాగ్యము విష్ణు కథ’కు బజ్ క్రియేట్ కావడం కష్టమవుతుంది. అందుకే దీని ప్రమోషన్, రిలీజ్‌లో అరవింద్, వాసు కీలకంగా వ్యవహరిస్తున్నారు.