ఎవరు ఎన్ని ఆర్గుమెంట్లు చేసినా థియేటర్లకొచ్చే ప్రేక్షకుల ఆలోచనల్లో విపరీతమైన మార్పులు వచ్చాయన్నది వాస్తవం. ఒకప్పుడు టైం పాస్ కోసమో లేదా ఎండ నుంచి ఉపశమనం ఇచ్చే ఏసి కోసమో హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా హాలుకు వచ్చే ఆడియన్స్ ప్రతి షోకు ఉండేవారు. కానీ క్రమంగా ఆ సంఖ్య తగ్గపోతోంది. బాగానే ఉందన్న టాక్ వచ్చినవి కూడా మొదటి మూడురోజుల్లోనే ఎదురీదాల్సిన పరిస్థితి నెలకొంది. స్టార్ హీరోలకు వీటి వల్ల వచ్చిన ఇబ్బందేమీ లేదు కానీ ఎటొచ్చి చిన్న సినిమాలు మాత్రం తమ దశదిశను మార్చుకోవాల్సి వచ్చేలా ఉంది. వీటి మనుగడ మరింత ప్రమాదంలో పడిపోయే పరిణామాలు దగ్గరలో కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఎక్కడ చూసినా తీవ్రంగా నడుస్తున్న చర్చ టికెట్ రేట్ల గురించి. తెలంగాణలో ఆర్ఆర్ఆర్ కు 400 రూపాయలకు పైగా పెట్టినా జనం చూశారు. శేఖర్, జయమ్మ పంచాయితీలు 150 అన్నా పబ్లిక్ లైట్ తీసుకున్నారు. అశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి డీసెంట్ కంటెంట్ ఉన్న మూవీస్ 200 రేట్ వల్ల ఇబ్బంది పడ్డాయి. మేజర్, విక్రమ్ లు మాదిరి 195 రూపాయలేనని ప్రత్యేకంగా పోస్టర్లలోనే రేట్లు పెట్టుకుని పబ్లిసిటీ చేసుకున్నారు. ఇప్పుడు అంటే సుందరం 250కి ఫిక్స్ చేయడం వసూళ్లను ప్రభావితం చేయడం కళ్ళముందు కనిపిస్తోంది. ఎఫ్3లో స్టార్ అట్రాక్షన్, మాస్ కామెడీ ఉండటంతో గట్టెక్కుతోంది కానీ లేదంటే ఇదీ తేడా కొట్టేది.
రాబోయే రోజుల్లో చాలా చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి. సమ్మతమే, చోర్ బజార్, గ్యాంగ్ స్టర్ గంగరాజు, గాడ్సే, కొండా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దది ఉంది. అన్నీ బడ్జెట్ పరిమితులకు లోబడి తీసినవే. ప్రమోషన్లు కూడా బాగానే చేసుకుంటున్నాయి. ఇవన్నీ ఓటిటిలో వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటున్న ఆడియన్స్ ని థియేటర్ దాకా రప్పించాలంటే ఏదో మేజిక్ జరగాల్సిన అవసరం లేదు. స్థిరత్వం లేని టికెట్ ధరలకు ఇప్పటికిప్పుడు అడ్డుకట్ట వేయలేకపోయినా కనీసం పది కోట్ల లోపు బడ్జెట్ అయిన వాటికి ధరలు ఇంకా తగ్గించే చర్యలు తీసుకోవడం చాలా అవసరం. లేదంటే జరగబోయేది ఊహించడమూ కష్టమే.