నాని విడమరిచి చెప్పాడు.. వదిలేస్తారా?

నేచురల్ స్టార్ నాని మామూలుగా అయితే వివాదాలకు దూరంగా ఉంటాడు. కోరి ఏ గొడవలోనూ తల దూర్చడు. ఐతే గతంలో అతడి ప్రమేయం లేకుండా ‘బిగ్ బాస్’ షో టైంలో ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఎన్టీఆర్ స్థానంలో హోస్ట్ కావడం ముందుగా కొంత వ్యతిరేకతకు దారి తీయగా.. ఆ తర్వాత హోస్ట్‌గా కౌశల్‌ను టార్గెట్ చేసినందుకు అతడి ఫ్యాన్స్ నాని మీద పడ్డారు. ఈ రెండు విషయాల్లోనూ నాని ప్రమేయం లేకుండా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది.

కొన్ని నెలల కిందట ఇండస్ట్రీకి మేలు చేసే ఓ మంచి మాట చెప్పడం ద్వారా నాని ఓ వర్గంలో వ్యతిరేకత ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ‘శ్యామ్ సింగరాయ్’ రిలీజ్ టైంలో ఆంధ్రప్రదేశ్ టికెట్ల ధరల సమస్య మీద మాట్లాడడమే అతడి తప్పయింది. సినిమా థియేటర్ల కౌంటర్ కంటే.. పక్కనుండే కిరాణా కొట్టు కౌంటర్ మెరుగ్గా ఉంటోందని, అలాంటపుడు థియేటర్లను నమ్ముకున్న వాళ్లు ఎలా బతుకుతారని నాని ప్రశ్నించడం ఏపీలో జగన్ సర్కారు మద్దతుదారులకు నచ్చలేదు.

దీంతో అతడి సినిమాకు ఇబ్బందులు తప్పలేదు. ఇప్పటికే జగన్ ఫ్యాన్స్ నానీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యల గురించి ఇటీవల మీడియాను కలిసినపుడు నాని వివరణ ఇచ్చాడు. రేట్లు మరీ తగ్గించడం గురించి తాను ఆవేదన వ్యక్తం చేశానని, ఇప్పుడు రేట్లు పెరగడం కూడా సమస్యే అని నాని అన్నాడు. అంతటితో ఆగకుండా ఇప్పుడు నాని తన వ్యాఖ్యల అర్థమేంటో మరింత వివరంగా చెప్పే ప్రయత్నం చేశాడు. సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు తానేమీ కిరాణా కొట్టు వాళ్లను కించపరచలేదని.. తాను ఒకప్పుడు హైదరాబాద్ అమీర్‌పేటలో ఇమేజ్ హాస్పిటల్ పక్కన కిరాణా స్టోర్లో పని చేశానని అన్నాడు.

అలాంటి స్టోర్‌ను నడపడానికి మెయింటైనెన్స్ 15 వేలు అయితే.. ఆదాయం 25 వేలు వస్తే దాని యజమాని బతకగలుగుతాడని.. మరి థియేటర్ నడపాలంటే నెలకు లక్షల్లో ఖర్చవుతుందని.. మరి కిరాణా కొట్టుతో సమానంగా, లేదంటే ఇంకా తక్కువగా ఆదాయం వస్తే దాన్ని యజమాని ఎలా నడుపుతాడన్నది తన ప్రశ్న అని.. ఇది అర్థం చేసుకోకుండా ఎవరికి తోచిన భాష్యాలు వాళ్లు చెప్పుకుని తనను ట్రోల్ చేశారని.. ఇప్పటికైనా తన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని నాని కోరాడు. మరి ఇప్పటికైనా అతడి వ్యతిరేకులు మారతారేమో చూడాలి.