యావత్ భారతదేశ సినీ సంగీత ప్రేమికులను విషాదంలో ముంచెత్తుతూ ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన గాయకుడు కెకె జ్ఞాపకాలతో సోషల్ మీడియా తడిసి ముద్దవుతోంది. హిందీ సింగరే అయినప్పటికీ తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన ట్రాక్ రికార్డు తనకుంది. అశేష సంఖ్యలో ఇక్కడి అభిమానులను సొంతం చేసుకోవడం కెకె ఘనత.
1996లో ప్రేమదేశం ద్వారా కెకె గొంతు మొదటిసారి సౌత్ లో వినిపించింది. కాలేజీ స్టైలే, హలో డాక్టర్ పాటలు ఛార్ట్ బస్టర్ కావడంతో తనకు గుర్తింపు రావడం మొదలయ్యింది. మొదటగా పాడిన స్ట్రెయిట్ మూవీ శశిప్రీతం స్వరాలు సమకూర్చిన సముద్రం. తర్వాత వందేమాతరం శ్రీనివాస్ కోసం ముత్యంలో పాడారు. ఈ రెండు పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు.
అసలైన బ్రేక్ 2000లో వచ్చిన పవన్ కళ్యాణ్ ఖుషినే. ఏ మేరా జహాని మణిశర్మ కెకెతో పాడించిన తీరు యూత్ కి గూస్ బంప్స్ తెప్పించింది. అక్కడి నుంచి కెకె ప్రస్థానం టాలీవుడ్లో గొప్పగా సాగింది. మనసంతా నువ్వేలో ఎవ్వరి నెప్పుడు తన వలలో బందిస్తుందో ఈ ప్రేమ అంటూ సిరివెన్నెల సాహిత్యాన్ని తన గాత్రంతో పలకడం ఎప్పటికీ మర్చిపోలేం.
జయం, నీ స్నేహం, సంతోషం, టక్కరి దొంగ, ఇంద్ర, జానీ, మల్లేశ్వరి, శంకర్ దాదా ఎంబిబిఎస్, ఘర్షణ, గుడుంబా శంకర్, 7జి బృందావన్ కాలనీ, అందరివాడు, బాలు, అపరిచితుడు, అతడు, హ్యాపీ, బంగారం, రణం, సైనికుడు, మున్నా, జల్సా, చింతకాయల రవి, ఓయ్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లాంటి ఎన్నో ఆల్బమ్స్ లో సినిమాల హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా కెకె తనకు మాత్రమే సాధ్యమయ్యే ముద్ర వేశారు. తెలుగులో పాడటం కొన్నేళ్ల క్రితమే తగ్గించినప్పటికీ కెకె పేరు అభిమానుల్లో చిరస్థానం కలిగి ఉంటుంది.