విడుదలైనట్లే తెలియదు.. కానీ హిట్టు


గత వారాంతంలో తెలుగు ప్రేక్షకుల దృష్టంతా మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ మీదే ఉంది. అంత పెద్ద సినిమా వస్తున్నపుడు పోటీగా ఇంకో తెలుగు సినిమాను ఏం రిలీజ్ చేస్తారు? ఎవరూ ఆ సాహసం చేయలేదు. కానీ ‘సర్కారు వారి పాట’ విడుదలైన తర్వాతి రోజు ఓ తమిళ అనువాద చిత్రం చడీచప్పుడు లేకుండా థియేటర్లలోకి దిగింది. అదే.. డాన్. శివ కార్తికేయన్, ప్రియాంక మోహన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ముందు ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు.

ఈ సినిమాకు ఎలాంటి ప్రమోషన్లూ లేవు. చిన్న ఈవెంట్ కూడా చేయలేదు. కనీసం తెలుగు వెర్షన్ కోసం ఒక పీఆర్వోను కూడా పెట్టుకోలేదు. అందుబాటులో ఉన్న థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఐతే తమిళంలో ఈ సినిమాకు చాలా మంచి టాక్ వచ్చింది. అదే సమయంలో ‘సర్కారు వారి పాట’కు ఇక్కడ డివైడ్ టాక్ రావడం తెలిసిందే. ఆ చిత్రానికి టికెట్ల ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దీంతో తెలుగులో ‘డాన్’ సినిమాకు నెమ్మదిగా టికెట్లు తెగడం మొదలైంది.

తెలుగు వెర్షన్ షోల కోసం సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేయడం, ఆల్రెడీ కేటియించిన షోలకు ఆక్యుపెన్సీ పర్వాలేదనిపించడంతో రెండో రోజు నుంచి ఈ చిత్రానికి థియేటర్లు పెరిగాయి. ‘సర్కారు వారి పాట’ ఓవర్ ఫ్లోస్ కూడా కొంత కలిసి రావడంతో వీకెండ్లో ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఎలాంటి ప్రచారం లేకుండా, అసలు రిలీజైనట్లే తెలియకుండా థియేటర్లలోకి దిగిన ఓ అనువాద చిత్రానికి ఈ మాత్రం స్పందన రావడం గొప్ప విషయమే.

ప్రస్తుతం ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో చేస్తున్న చిత్ర ద్వారా శివకార్తికేయన్ తెలుగులోకి అడుగు పెట్టబోతున్నాడు. ఆల్రెడీ అతడి గత చిత్రం ‘వరుణ్ డాక్టర్’ తెలుగులో బాగా ఆడింది. ‘డాన్’ సినిమాను కూడా అతను తెలుగులో ప్రమోట్ చేసి ఉంటే.. పరిస్థితి మెరుగ్గా ఉండేది. తెలుగు ఎంట్రీకి ముందు అతడి క్రేజ్ పెరిగి ఉండేది. ఇప్పుడా సినిమా ఉన్నంతలో బాగానే ఆడుతున్న నేపథ్యంలో శివకార్తికేయన్ వచ్చి సినిమాను ప్రమోట్ చేస్తే రెండో వీకెండ్లో సినిమా ఇంకా ప్రభావం చూపే అవకాశముంది.