జూన్‌లో సౌత్ సినిమా ప్ర‌కంప‌న‌లే

ఆల్రెడీ బాలీవుడ్ సౌత్ సినిమాల దెబ్బ‌కు విల‌విల‌లాడుతోంది. గ‌త ఏడాది డిసెంబ‌రులో పుష్ప నార్త్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిందో తెలిసిందే. ఆ త‌ర్వాత ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్‌-2 చిత్రాలు అక్క‌డ వ‌సూళ్ల మోత మోగించేశాయి. ముఖ్యంగా కేజీఎఫ్‌-2 సంచ‌ల‌నాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

ఆ సినిమా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి హిందీలో మ‌రే చిత్రం కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిల‌బ‌డ‌లేక‌పోయింది. వారాలు గ‌డుస్తున్నాయి. కొత్త సినిమాలు వ‌స్తున్నాయి. అవేవీ కూడా కేజీఎఫ్‌-2 ధాటిని త‌ట్టుకోలేక‌పోయాయి. ఈ సినిమా త‌ర్వాత కొంచెం గ్యాప్ రాగా.. మ‌ళ్లీ జూన్‌లో ద‌క్షిణాది సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి.

వాటిలో ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సింది అడివి శేష్ న‌టించిన మేజ‌ర్ గురించే. ముంబ‌యి తాజ్ హోట‌ల్ మీద ఉగ్ర‌వాదుల దాడి స‌మ‌యంలో హీరోగా నిలిచిన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా అత‌ను న‌టించిన మేజ‌ర్ మీద పాన్ ఇండియా స్థాయిలో మంచి అంచ‌నాలున్నాయి. దేశ‌వ్యాప్తంగా అంద‌రికీ క‌నెక్ట‌య్యే క‌థ ఇది. ఈ సినిమా కోసం ఉత్త‌రాది ప్రేక్ష‌కులు ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. జూన్ 3న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

అదే రోజు మ‌రో పాన్ ఇండియా మూవీ కూడా రిలీజ‌వుతోంది. అదే.. విక్ర‌మ్. క‌మ‌ల్ హాస‌న్, విజ‌య్ సేతుప‌తి, ఫాహ‌ద్ ఫాజిల్‌ల క్రేజీ కాంబినేష‌న్లో లోకేష్ క‌న‌క‌రాజ్ రూపొందించిన చిత్ర‌మిది. ఈ కాంబినేష‌న్ క్రేజ్‌కు కూడా అదిరే ట్రైల‌ర్‌తో ఈ సినిమా అంచ‌నాలు పెంచింది.

ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ‌వుతున్న సినిమా ఇది. క‌మ‌ల్ ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడ‌ని, దేశ‌వ్యాప్తంగా ఈ సినిమా స‌త్తా చాటుతుంద‌ని ఆయ‌న అభిమానులు ఆశిస్తున్నారు. మ‌రోవైపు మ‌ల‌యాళంలో తురుముఖం అనే క్రేజీ మూవీ జూన్‌లోనే రాబోతోంది. రాజీవ్ ర‌వి రూపొందించిన ఈ చిత్రం అదిరిపోయే ప్రోమోల‌తో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి పెంచింది. ఈ చిత్రంలోనూ భారీ తారాగ‌ణం ఉంది. దీన్నీ వివిధ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. జూన్ 3నే ఈ చిత్రం కూడా విడుద‌ల‌వుతుంది.

ఇంకోవైపు నాని సినిమా అంటే సుంద‌రానికి కూడా సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ మ‌ధ్య రిలీజ‌వుతున్న సినిమానే. జూన్ 10న తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఇక క‌న్న‌డ సినిమా 777 చార్లీ కూడా పాన్ ఇండియా లెవెల్లో స‌త్తా చాట‌గ‌ల సినిమానే అని అంచ‌నా వేస్తున్నారు. దీని ట్రైల‌ర్ అంద‌రినీ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.