నేనేది ముట్టుకున్నా బ్లాక్‌బస్టరే-మహేష్

తన కెరీర్ కొన్నేళ్లుగా వరుస విజయాలతో సాగిపోతుండటం పట్ల సూపర్ స్టార్ మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మధ్య తాను ఏది పట్టుకున్నా బ్లాక్‌బస్టర్ అయిపోతోందని మహేష్ అన్నాడు. తన నిర్మాణంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘మేజర్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో భాగంగా ఈ చిత్ర సమర్పకుల్లో ఒకడైన అనురాగ్ తాను ఎక్కువ రిస్క్‌లు తీసుకుంటానని వ్యాఖ్యానించడంపై మహేష్ బాబు సరదాగానే అభ్యంతరం వ్యక్తంచేశాడు. అనురాగ్ చెప్పింది అబద్ధమని, తాను పెద్దగా రిస్క్‌లు తీసుకోనని మహేష్ అన్నాడు. దానికి కొనసాగింపుగా.. ‘‘గత నాలుగైదేళ్లుగా నేను ఏది ముట్టుకున్నా బ్లాక్‌బస్టర్ అయిపోతోంది. కాబట్టి రిస్క్‌లు తీసుకోవాల్సిన అవసరం లేదు’’ అని మహేష్ నవ్వేశాడు. దీంతో ఆడిటోరియం ఒక్కసారిగా హోరెత్తింది.

చివరగా మహేష్ 2017లో ‘స్పైడర్’తో డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. తర్వాతి ఏడాది ‘భరత్ అనే నేను’ హిట్టయింది. తర్వాతి రెండేళ్లు వరుసగా మహర్షి, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో బ్లాక్‌బస్టర్లు కొట్టాడు. కరోనా లేకుంటే గత ఏడాడే ‘సర్కారు వారి పాట’ రిలీజయ్యేది. ఈ సినిమా ఆలస్యమైనా సరే.. దీని విజయం మీదా మహేష్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.

ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ‘మేజర్’ సినిమా చూసి సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్ కాకుండా నేను నటించి ఉంటే బాగుండేదని మీకేమైనా అనిపించిందా అని ఓ విలేకరి అడగ్గా.. ఛాన్సే లేదనేశాడు మహేష్. తాను ఎప్పుడూ ఇంకొకరు చేసిన పాత్ర చూసి,తాను చేస్తే బాగుండేదని అనుకోనని.. తనకు అలాంటి స్వార్థం లేదని.. ఎప్పుడూ ఒక ప్రేక్షకుడి లాగే వేరే సినిమాలు చూస్తున్నానని.. తన సినిమాలు తనకుంటాయని, వేరే వాళ్లు చేయాల్సినవి వాళ్లు చేస్తారని.. మేజర్ పాత్రకు శేష్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని, ఆ క్యారెక్టర్‌ను అతను అద్భుతంగా చేశాడని వ్యాఖ్యానించాడు మహేష్.