3 రోజుల్లో 80 కోట్లు – డాక్టర్ రికార్డు

ఈ మధ్య హాలీవుడ్ మూవీస్ కి దేశవ్యాప్తంగా క్రేజ్ బాగా పెరిగిపోతోంది. ఒకప్పుడు స్పైడర్ మ్యాన్, జురాసిక్ పార్క్ లాంటి రెండు మూడు సిరీస్ లకు ఎక్కువ ఫ్యాన్స్ ఉండేవారు. వీళ్ళే మొదటి రోజు చూసేందుకు ఎగబడేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోతోంది. మార్వెల్ నుంచి వచ్చిన ఏ మూవీ అయినా సరే ఇండియాలోనూ భారీ ఓపెనింగ్స్ దక్కుతున్నాయి. దానికి నిదర్శనమే డాక్టర్ స్ట్రేంజ్ మల్టీ వర్స్ అఫ్ మ్యాడ్ నెస్ కు వస్తున్న స్పందన. నిజానికిది వరల్డ్ వైడ్ భీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న సూపర్ హీరో సీక్వెల్ కాదు.

ఫ్యాన్స్ ఉన్నారు కానీ మరీ ఇంతలా వసూళ్లు వస్తాయని మాత్రం ఊహించనిది. కేవలం మూడు రోజుల్లో అన్ని భారతీయ వెర్షన్లు కలిపి 80 కోట్లు వసూలు చేయడమంటే మాటలు కాదు. తెలుగు రాష్ట్రాల్లోనూ డాక్టర్ గట్టిగానే లాగాడు. రిలీజ్ రోజు ప్రసాద్ ఐమ్యాక్స్ లో మూడు తెలుగు సినిమాలు రిలీజైనా వాటికి లేని హౌస్ ఫుల్ బోర్డు దీనికి పడిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాకపోతే డాక్టర్ స్ట్రేంజ్ కి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. గ్రాఫిక్స్ అదిరాయంటున్నారు కానీ కథాకథనాల పరంగా మిశ్రమ స్పందన ఉంది.

ఇంత కలెక్షన్స్ రావడానికి కారణం లేకపోలేదు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2లు అయ్యాక గ్రాండియర్ అనిపించే సరైన చిత్రం ఏదీ రాలేదు. హిందీలోనూ అంతే. హీరోపంటి 2, రన్ వే 34లు తుస్సుమన్నాయి. దీంతో ఆటోమేటిక్ గా డాక్టర్ స్ట్రేంజ్ కే ఆడియన్స్ ఓటేశారు. శుక్రవారం 28.35 కోట్లు, శనివారం 25.75 కోట్లు, నిన్న 25.40 కోట్లు రాబట్టిన ఈ సినిమా వంద కోట్లు అందుకోవడం ఈజీనే. ఈ శుక్రవారం మహేష్ బాబు సర్కారు వారి పాట వస్తోంది కాబట్టి ఏపీ తెలంగాణలో ఫిగర్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి