ఈ మధ్య సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెలెవ్లో ఎలా సంచలనం రేపుతున్నాయో చూస్తూనే ఉన్నాం. పుష్ప సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారంటే ఏదో మొక్కుబడి వ్యవహారం అనుకున్నారు కానీ.. ఆ చిత్రం నార్త్, సౌత్ అని తేడా లేకుండా వసూళ్ల మోత మోగించేసింది. ఇక ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 సినిమాలు అంచనాలను మించి పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు రాబట్టాయి. ఈ మూడు చిత్రాల ధాటికి బాలీవుడ్ బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది.
కేజీఎఫ్-2 రిలీజైన మూడు వారాలకు కూడా జోరు తగ్గించకుండా ఇప్పటికీ మంచి వసూళ్లే రాబడుతోంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యాక కొంచెం గ్యాప్‌లో మరో దక్షిణాది చిత్రం దేశవ్యాప్తంగా అదరగొడితే ఆశ్చర్యం లేదంటున్నారు ఇక్కడి ట్రేడ్ పండిట్లు. కమల్ హాసన్ సినిమా విక్రమ్ మీద వారికి బాగానే గురి కుదిరినట్లు సమాచారం.
ఖైదీ, మాస్టర్ సినిమాలతో ఆకట్టుకున్న లోకేష్ కనకరాజ్.. కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్‌ల సంచలన కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేయడంతోనే విక్రమ్ మీద అంచనాలు పెరిగిపోయాయి. గత దశాబ్ద కాలంలో కమల్ చాలా వరకు సినిమాల్లో ఇన్ యాక్టివ్‌గానే ఉన్నారు. చేసిన సినిమాలు తక్కువ. అవి పెద్దగా ప్రభావం చూపలేదు. ఆయన చాలా గ్యాప్ తర్వాత విక్రమ్ లాంటి క్రేజీ ప్రాజెక్టులో నటించారు. ఆయనకు ఈ తరంలో మేటి నటులుగా పేరున్న విజయ్ సేతుపతి, ఫాహద్ కూడా తోడవడం.. లోకేష్ లాంటి ఎగ్జైటింగ్ ఫిలిం మేకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో ప్రేక్షకులు ఈ చిత్రం కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇందులో బోలెడంత యాక్షన్ కూడా ఉండేలా కనిపిస్తుండటంతో నార్త్ మాస్ ఆడియన్స్ దృష్టిని ఈ సినిమా బాగానే ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.
ఇంకా పబ్లిసిటీ జోరు పెరగలేదు కానీ.. వివిధ భాషల్లో కోట్లమంది ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 15న రిలీజ్ కానున్న ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు ఉండి, పబ్లిసిటీ హోరెత్తిస్తే.. పాన్ ఇండియా స్థాయిలో విక్రమ్ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి అవకాశముంది.