మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ఆచార్యకు బాక్సాఫీస్ దగ్గర ఇంతటి దారుణమైన ఫలితం వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. అప్పుడెప్పుడో మృగరాజు తర్వాత ఆయన సినిమాలు వేటికీ ఇలాంటి చేదు అనుభవం ఎదురు కాలేదు. శంకర్ దాదా జిందాబాద్ ఫ్లాపే కానీ.. ఆ చిత్రానికి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. నష్టాలు స్వల్పమే. ఆ సినిమా తర్వాత పదేళ్లు గ్యాప్ తీసుకుని ఖైదీ నంబర్ 150తో చిరు రీఎంట్రీ ఇస్తే దానికి బ్రహ్మరథం పట్టారు. సైరా నరసింహారెడ్డి బడ్జెట్ ఎక్కువ కావడం వల్లా కాస్ట్ ఫెయిల్యూర్ అయింది కానీ.. దానికి తెలుగు రాష్ట్రాల్లో ఖైదీ నంబర్ 150ని మించి వసూళ్లు వచ్చాయి.
ఇలాంటి ట్రాక్ రికార్డున్న చిరు.. ఆర్ఆర్ఆర్‌తో మెగా హిట్ అందుకున్న చరణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ కొరటాల శివ లాంటి బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌తో జట్టు కడితే రిలీజ్ రోజు వరకు సందడి చేసి ఆ తర్వాత సినిమా చతికిలపడింది. 60-70 శాతం మేర డిస్ట్రిబ్యూటర్లు నష్టాల పాలయ్యారు.
బయ్యర్లకు ఏదో సెటిల్మెంట్ నడుస్తోందని వార్తలొచ్చాయి కానీ.. ఈలోపు ఓ డిస్ట్రిబ్యూటర్ తమను ఆదుకోవాలని కోరుతూ చిరంజీవికి బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఆ డిస్ట్రిబ్యూటర్ పేరు రాజగోపాల్ బజాజ్. నైజాం పరిధిలోకి వచ్చే కర్ణాటక ప్రాంతం రాయిచూర్‌లో అతను ఆచార్య సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాడట.
కార్తికేయ ఎగ్జిబిటర్స్ అధినేత వరంగల్ శ్రీను నుంచి హక్కులు తీసుకుని తాను ఆచార్య సినిమాను కళ్యాణ్ కర్ణాటక ప్రాంతంలో రిలీజ్ చేశానని.. ఏడాది ముందే ఒప్పందం జరగ్గా, రిలీజ్ ముంగిట ఫుల్ అమౌంట్ కట్టి సినిమాను తీసుకున్నానని.. చిరంజీవి సినిమా కదా జనాలు బాగా చూస్తారనుకుంటే అది జరగలేదని.. కేవలం 25 శాతమే రికవరీ జరిగిందని, 75 శాతం నష్టం వాటిల్లిందని.. దీని వల్ల తాము అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చిందని తెలిపాడు రాజగోపాల్. చిరు జోక్యం చేసుకుని డిస్ట్రిబ్యూటర్లకు పరిహారం అందేలా చూడాలని అతను కోరాడు. మరి దీనిపై చిరు ఎలా స్పందిస్తాడో చూడాలి.