బాలీవుడ్లో టాక్ షోల లిస్టు తీస్తే అందులో టాప్‌లో ఉంటుంది కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం. బాలీవుడ్ టాప్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ నిర్వహించే ఈ టాక్ షో.. 2004లో మొదలై తొలి సీజన్లోనూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్, ఇతర రంగాల సెలబ్రెటీలతో కరణ్ చాలా ఆసక్తికరంగా ఈ షోను నడిపిస్తూ వీక్షకుల మనసులు దోచాడు. ఈ సెలబ్రెటీలతో కరణ్‌కు ఉన్న సాన్నిహిత్యం వల్ల చాలా ఆసక్తికరమైన, వివాదాస్పదమైన ప్రశ్నలు కూడా అడిగి సమాధానాలు రాబట్టడంతో జనాలు బాగా దీనికి కనెక్ట్ అయ్యారు. ఈ షోకు కొన్ని వివాదాలు సైతం కలిసొచ్చాయి.
ఐతే 19 ఏళ్ల వ్యవధిలో ఈ షో ఆరు సీజన్లు మాత్రమే నడిచింది. మిగతా షోల మాదిరి ఇది ఏటా నడవలేదు. కరణ్‌కు ఖాళీ దొరికినపుడు మాత్రమే ఈ షో చేస్తూ వచ్చాడు. చివరగా 2019లో ఆరో సీజన్ చూశారు ప్రేక్షకులు. దానికి మంచి ఆదరణ దక్కింది.
ఐతే స్టార్ టీవీలో ఆరు సీజన్లు అలరించిన ఈ షోకు తెరపడింది. ఇకపై మళ్లీ ‘కాఫీ విత్ కరణ్’ షోను చూడబోం. ఈ విషయాన్ని స్వయంగా కరణ్ జోహారే ధ్రువీకరించాడు. ‘కాఫీ విత్ కరణ్’ ఏడో సీజన్ అతి త్వరలో ఆరంభం కాబోతున్నట్లుగా ఒక ఎంటర్టైన్మెంట్ పోర్టల్ వార్త ప్రచురించగా.. దాని అభిమానులు ఎగ్జైట్ అయ్యారు. సోషల్ మీడియాలో దీని గురించి కరణ్‌ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో ఒక కరణ్ ఒక నోట్ రిలీజ్ చేసి ఇకపై ఈ షో ఉండదనే చేదు వార్తను చెప్పాడు.
‘‘కాఫీ విత్ కరణ్ నా జీవితంలో ఒక భాగం, అలాగే మీ జీవితాల్లో కూడా. ఆరు సీజన్ల పాటు ఈ షో నడిచింది. మేం ఈ షో ద్వారా బలమైన ప్రభావం చూపించగలిగామనుకుంటున్నా. ఐతే ఇప్పుడు బరువైన హృదయంతో ఒక మాట చెప్పదలుచుకున్నా.. కాఫీ విత్ కరణ్ పునరాగమనం చేయబోదు’’ అని కరణ్ ఈ నోట్‌లో స్పష్టం చేశాడు. ఈ నోట్ కాఫీ విత్ కరణ్ అభిమానులందరికీ తీవ్ర నిరాశ కలిగిస్తుందని వేరే చెప్పేదేముంది?
Gulte Telugu Telugu Political and Movie News Updates