నేచురల్ స్టార్ నాని శనివారం ఒక కొత్త సినిమా టీజర్ లాంచ్ చేశారు. ఆ సినిమా పేరు.. ‘ముత్తయ్య’. ఇందులో హీరో వయసు అటు ఇటుగా ఒక 70 ఏళ్లుంటాయి. తలపై జుట్టు, గడ్డం పూర్తిగా తెల్లబడిపోయిన వ్యక్తి ఆయన. సుధాకర్ రెడ్డి అనే థియేటర్ ఆర్టిస్టు ఈ పాత్రలో నటించారు. ఈ సినిమా టీజర్‌ను నాని లాంచ్ చేస్తూ.. ‘‘నాకు ‘అష్టాచెమ్మా’లో అవకాశం రాకపోయి ఉంటే 70 ఏళ్లకు నేను కూడా ఇలాగే అయ్యేవాడినేమో’’ అని కామెంట్ చేశాడు.
అతనీ కామెంట్ చేయడంలోనే ఈ సినిమా సారాంశం మొత్తం ఇమిడి ఉంది. నటన మీద విపరీతమైన మక్కువ ఉండి.. నాటకాల్లో ప్రతిభ చాటుకుని.. ఎప్పటికైనా సినిమాల్లో నటించి వెండితెరపై తనను తాను చూసుకోవాలని ఆశపడ్డ ఓ వ్యక్తి.. ఆ ఆశ తీరకుండానే ముదిమి వయసులోకి వచ్చేస్తే.. ఆ వయసులో కూడా తన కలను పక్కన పెట్టకుండా సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తే.. ఇదే ఈ సినిమా కథాంశం.
మామూలుగా ఏ మలయాళంలోనో.. బెంగాలీలోనో.. ఇలాంటి వైవిధ్యమైన, సహజమైన కథాంశాలతో సినిమాలు వస్తుంటాయి. అభిరుచి ఉన్న ఇండిపెండెంట్ దర్శకులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన టాలీవుడ్లో ఇలాంటి ప్రయత్నం జరగడం అరుదైన విషయమే. ‘కేరాఫ్ కంచరపాలెం’ లాంటి సినిమాలను స్ఫూర్తి పొందారో ఏమో.. ధైర్యంగా ‘ముత్తయ్య’ లాంటి చిత్రం చేయడానికి ముందుకొచ్చినట్లుంది దీని టీం.
టీజర్ ఆద్యంతం హృద్యంగా, ఆహ్లాదకరంగా, మనసుకు హత్తుకునేలా సాగి పూర్తి సినిమా చూడాలన్న ఆసక్తి రేకెత్తించేలా సాగింది. ఐతే ఇలాంటి చిత్రాలకు ఓటీటీల్లో మంచి ఆదరణ దక్కుతుంటుంది కానీ.. థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడమే కష్టం. మరి చిత్ర బృందం ఆ ప్రయత్నంలో ఎంతమేర విజయవంతం అవుతుందో చూడాలి. భాస్కర్ మౌర్య రూపొందించిన ఈ చిత్రాన్ని వృందా ప్రసాద్ నిర్మించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates