ఇవాళ రెండో రోజే కానీ ఆచార్య ఫలితం ఏంటో స్పష్టంగా అర్థమైపోయింది. కాకపోతే నష్టమెంతనేది ఫైనల్ రన్ అయ్యాకే బయట పడుతుంది. పరిశ్రమలో కొన్ని సెంటిమెంట్లు ఎంత విచిత్రంగా ఉంటాయో తెలిసిందే. ఏదో కాకతాళీయంగా అనిపిస్తాయి కానీ తరచి చూస్తే ఆశ్చర్యపరిచే సంగతులు ఉంటాయి. తెలుసుకున్నాక అరె అవును కదానిపిస్తుంది. అలాంటిదే ఇది కూడా.
చిరంజీవి 152 సినిమాల కెరీర్లో తెలుగులో రెండో అక్షరం ‘ఆ’ అస్సలు అచ్చిరాలేదంటే నమ్మశక్యం కాకపోవచ్చు కానీ ఇది నిజం. అదెలాగో చూద్దాం. ఆ అక్షరంతో వచ్చిన చిరు మొదటి సినిమా ఆరని మంటలు. ఇంకా ఇమేజ్ రాని టైం అది. పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత చిన్న పాత్ర చేసిన ఆడవాళ్లు మీకు జోహార్లు యావరేజ్ అనిపించుకుంది.
ఆలయ శిఖరం కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఎన్నో అంచనాలతో తమిళ కల్ట్ డైరెక్టర్ భారతీరాజాతో చేసిన ఆరాధన నటన పరంగా పేరు తెచ్చింది కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం బోల్తా కొట్టింది. కె విశ్వనాథ్ గారి అపూర్వ సృష్టి ఆపద్బాంధవుడు అవార్డులు తెచ్చిందే తప్ప నిర్మాతకు కాసులు ఇవ్వలేదు.
ఇలా ఆతో మొదలైన ఏ చిత్రం చిరంజీవికి సూపర్ హిట్ ని ఇవ్వలేకపోయింది. హిందీలో ఆజ్ కా గూండారాజ్ విజయవంతమయ్యింది కానీ దాన్ని తెలుగు కింద పరిగణించలేం. ఇప్పుడు ఆచార్య వంతు వచ్చింది. ఏం జరుగుతోందో కళ్లారా చూస్తున్నాం. అయితే మెగాస్టార్ ఆ ఇలా తేడా కొట్టేసింది కానీ మొదటి అక్షరం అ మాత్రం హిట్లు ఇచ్చింది. అడవిదొంగ, అల్లుడా మజాకా, అన్నయ్య ఇలా చెప్పుకోదగ్గవి ఉన్నాయి. కానీ అదేంటో మరి ఆ మాత్రం ఊహూ అంటూ ఇలా చేదు ఫలితాలతో మొండికేసింది.