ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు.. రామ్ గోపాల్ వర్మను చూసి చాలామంది అనుకునే మాట ఇది. శివ సినిమాలో చరిత్ర సృష్టించి.. రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్ లాంటి చిత్రాలతో ఒక ట్రెండ్ సెట్ చేసి వివిధ భాషల్లో వేలాది మందిని సినీ రంగం వైపు పరుగులు పెట్టేలా చేసిన దర్శకుడాయన. ప్రస్తుతం మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వర్మను చూసి ఇన్‌స్పైర్ అయినంత మంది మరే దర్శకుడినీ చూసి స్ఫూర్తి పొంది ఉండరు అంటే అతిశయోక్తి కాదు.
అలాంటి దర్శకుడి నుంచి ఇప్పుడు సినిమా వస్తుంటే థియేటర్లు ఇవ్వడానికి ఎగ్జిబిటర్లు, థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదు. వర్మ సినిమా అంటే అందులో ఏమీ ఉండదనే అభిప్రాయానికి వచ్చేశారు ఆడియన్స్. పూర్తి చేసి రెడీగా పెట్టుకున్న చిత్రాలను రిలీజ్ చేయలేని స్థితిలో ఉన్నాడు వర్మ.
ఆయన ట్రాక్ రికార్డు చూసి కాస్త పేరున్న ఏ హీరో కూడా సినిమా చేయడానికి ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి టైంలో కన్నడలో పెద్ద స్టార్ అయిన ఉపేంద్ర.. వర్మకు ఛాన్సిచ్చాడు. వీరి కలయికలో ఆర్ అనే గ్యాంగ్ స్టర్ మూవీ రాబోతోంది. ఇంతకుముందే ఈ సినిమాను అనౌన్స్ చేయగా.. నిజంగా వర్మను నమ్మి ఉపేంద్ర సినిమా చేస్తాడా.. ఇది అసలు కార్యరూపం దాలుస్తుందా.. వర్మ చాలా సినిమాల్లాగే అనౌన్స్‌మెంట్‌కు పరిమితం అవుతుందా అని సందేహాలు కలిగాయి. ఐతే ఈ చిత్రం నిజంగానే సెట్స్ మీదికి వెళ్లింది.
షూటింగ్ కూడా జరుపుకుంటోంది. ఫస్ట్ లుక్ కూడా రెడీ అయింది. బెంగళూరులో శివరాజ్ కుమార్ సహా అతిరథ మహారథుల సమక్షంలో ఫస్ట్ లుక్ లాంచింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తన సినిమాల్లో క్వాలిటీ పడిపోవడం గురించి ప్రశ్నిస్తే వితండవాదం చేసే వర్మకు కూడా తన కెరీర్ ఎంత పతనం అయిందో వాస్తవం తెలియకుండా ఉండదు. కాబట్టి ఇలాంటి టైంలో లైఫ్ లైన్ లాగా వచ్చిన ఉపేంద్ర సినిమా అవకాశాన్ని ఉపయోగించుకుని తన స్థాయికి తగ్గ చిత్రాన్ని డెలివర్ చేస్తాడేమో చూడాలి.