నానీ.. నిఖిల్.. ఎందుకొచ్చిన ప్రయాస?

కొన్నేళ్లుగా సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ఎలా ప్రభంజనం సృష్టిస్తున్నాయో తెలిసిందే. కానీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందాన.. ఏవో కొన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మంచి వసూళ్లు రాబట్టేస్తున్నాయని.. ప్రతి ఒక్కరూ తమ చిత్రాలను కూడా బహు భాషల్లో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఏ తరహా సినిమాలకు ఇలా దేశవ్యాప్తంగా ఆదరణ ఉంటోంది.. ఎలా ప్రమోట్ చేస్తే ఇతర భాషల ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు.. అన్నది చూడటం లేదు కొందరు హీరోలు. కేవలం ఒక భాషలో సినిమా తీస్తున్నారు. వేరే భాషల్లో అనువాదం చేసి వదిలేస్తున్నారు. సరైన ప్రమోషన్లు కూడా లేకుండా రిలీజవుతున్న ఆ చిత్రాలు విడుదల ఖర్చులు కూడా వెనక్కి తేవడం లేదు.

నేచురల్ స్టార్ నాని విషయానికి వస్తే.. అతడి గత సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ని తమిళం, మలయాళంలోనూ రిలీజ్ చేశారు. కానీ ఆ చిత్రం కనీస ప్రభావం కూడా చూపలేదు. కానీ ఇప్పుడు తన కొత్త సినిమా ‘అంటే సుందరానికీ’ని కూడా ఆ రెండు భాషల్లో రిలీజ్ చేయబోతున్నాడు. ఈ మేరకు తాజాగా ప్రకటన వచ్చింది.

సరిగ్గా రిలీజ్ ముంగిట ఇలా వేరే భాషల్లో రిలీజ్ అంటే ప్రయోజనం ఉండదు. ముందు నుంచి ఒక పద్ధతి ప్రకారం సినిమాను ఆయా భాషల్లో ప్రమోట్ చేయాలి. వివిధ భాషల ప్రేక్షకులను ఆకర్షించే క్రేజీ కంటెంట్ రెడీ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ విషయంలో మాస్, యాక్షన్ అంశాలు కీలకం. కానీ ‘అంటే సుందరానికీ’ సినిమా వేరే భాషల వాళ్లను ఆకర్షించే సూచనలు ఇప్పటికైతే ఏమీ కనిపంచడం లేదు.

మరోవైపు తెలుగులోనే సరైన హిట్లు లేక సతమతం అవుతున్న నిఖిల్ సిద్దార్థ సైతం పాన్ ఇండియా ఇమేజ్ కోసం తపిస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. అతడి కొత్త చిత్రం ‘స్పై’ని పాన్ ఇండియా లెవెల్లో ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ చూసి నెటిజన్లు కామెడీ చేస్తున్నారు. నిజానికి నాని సైతం ఈ మధ్య సరైన ఫాంలో లేడు. ముందు తెలుగులో నిలదొక్కుకోకుండా, ఒక స్థాయి అందుకోకుండా ఎందుకొచ్చిన పాన్ ఇండియా ప్రయాస అంటూ ఈ యంగ్ హీరోల మీద కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు.