సినిమా వేడుకల్లో చాలా సీరియస్‌గా కనిపిస్తాడు పవన్ కళ్యాణ్. తన సినిమా వేడుకల్లో కూడా ఆయన మాట్లాడ్డం చాలా తక్కువ. వేరే వాళ్ల సినిమా వేడుకలకు, ఇంకేవైనా ప్రమోషనల్ ఈవెంట్లకు అసలే రాడు. తన ఫ్యామిలీ హీరోలకు సంబంధించిన ఈవెంట్లలో కూడా ఎప్పుడో కానీ పాల్గొనడు.
అలాంటివాడు యాంకర్ సుమ ప్రధాన పాత్ర పోషించిన జయమ్మ పంచాయితీ సినిమాకు సంబంధించి ఒక ఈవెంట్లో పాల్గొని తన చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయడం విశేషం. అంతే కాక ఈ వేడుకలో చాలా సరదాగా మాట్లాడాడు కూడా. సుమ గురించి ఆయన మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. సుమకు తాను అభిమానినని పవన్ ఈ సందర్భంగా చెప్పడం విశేషం.
సుమకు చాలామంది అభిమానులున్నారని, వారిలో తానూ ఒకడినని పవన్ అన్నాడు. ఆమెలో మంచి నటి దాగి ఉందని, కేవలం యాంకరింగ్‌కే పరిమితం కాకుండా, అప్పుడప్పుడూ ఇలా సినిమాల్లో కూడా నటిస్తూ ఉండాలని పవన్ కోరాడు. సుమతో కలిసి నటించాలని కూడా కోరుకుంటున్నట్లు పవన్ చెప్పడం విశేషం.
సుమకు ఇష్టమైతే తాను తన సినిమాల నిర్మాతలతో మాట్లాడతానని.. ఆమె ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటోందో చెబితే అలా ఉండేలా తన కోసం క్యారెక్టర్లు సిద్ధం చేయిస్తామని పవన్ వ్యాఖ్యానించాడు. దీనికి సుమ ఒకింత సంబరపడుతూ.. వెంటనే నిర్మాతలు ఎక్కడ అని నవ్వుతూ అడిగింది.
దీంతో పవన్ సహా అందరూ గట్టిగా నవ్వేశారు. ఇక పవన్ చేతుల మీదుగా లాంచ్ అయిన జయమ్మ పంచాయితీ ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. సుమ కామెడీ టైమింగ్‌కు తగ్గ కథనే దర్శకుడు విజయ్ కుమార్ ఎంచుకున్నట్లున్నాడు. చాలా వరకు సరదాగా సాగుతూ.. కొంతమేర ఎమోషనల్‌గా కూడా కదిలించే సినిమాలా కనిపిస్తున్న జయమ్మ పంచాయితీ మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates