సుమ అనగానే అందరూ ఆమెను యాంకర్‌గానే చూస్తారు. యాంకరింగ్ మొదలుపెట్టడానికి ముందే ఆమె నటి అనే విషయం చాలామందికి తెలియదు. దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ఆమె ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే చిత్రంలో కథానాయికగా నటించింది. దాంతో పాటు సీరియళ్లలో కూడా చేసింది. కానీ అనుకోకుండా యాంకర్‌గా మారి.. అందులో గొప్ప స్థాయిని అందుకుంది.
ఐతే చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు సుమలోని నటి బయటికి వచ్చింది. ఆమె ప్రధాన పాత్రలో ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ముందు ఏప్రిల్ 22నే రిలీజ్ అనుకున్నారు కానీ.. ‘కేజీఎఫ్-2’ జోరు చూసి సినిమాను రెండు వారాలు వాయిదా వేశారు. మే 6వ తేదీకి రిలీజ్ ఖరారు చేస్తూ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లాంచ్ అయిన ట్రైలర్ చాలా సరదాగా.. కొంత ఎమోషనల్‌గా సాగి ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది.
ఉత్తరాంధ్ర నేపథ్యంలో చాలా అథెంటిగ్గా ఈ సినిమాను తీర్చిదిద్దినట్లున్నాడు కొత్త దర్శకుడు విజయ్ కుమార్. అక్కడి పల్లెటూరి మనుషుల్లో ఉండే అమాయకత్వం, స్వచ్ఛత, గడుసుతనం ట్రైలర్లో కనిపించాయి. ముఖ్యంగా సుమ పాత్ర ఆద్యంతం ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఎప్పుడూ యాంకర్‌గానే చూసే సుమలో ఇంత మంచి యాక్టర్ ఉందా అనిపించేలా ఆమె అదరగొట్టేసింది. ఈ సినిమా కథే చాలా వెరైటీగా అనిపిస్తోంది. తన భర్త, పిల్లలతో సంతోషంగా జీవనం సాగిస్తున్న జయమ్మ అనే మధ్య వయస్కురాలైన మహిళకు అనుకోని కష్టం వస్తుంది. ఆమె భర్త మంచం పడతాడు. వైద్యానికి డబ్బులుండవు. అప్పుడు ఆమె పంచాయితీకి వెళ్తుంది.
ఊర్లో పెళ్ళిళ్ళు, ఇతర వేడుకలు జరిగినపుడు తాను ఒక్కొక్కరికి ఇచ్చిన కానుకలకు ఎవరూ బదులు ఇవ్వలేదని, అందుకు వడ్డీతో కలిపి ఇప్పుడు అందరూ చెల్లింపులు చేయాలని ఆమె పంచాయితీకి వెళ్తుంది. ఈ చదివింపులను ఉత్తరాంధ్రలో ఈడ్లు అంటారు. ట్రైలర్ చివర్లో దీని గురించే ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ చెబుతూ సుమ ఒక బూతు మాటను కూడా పలికింది. మొత్తంగా చూస్తే ట్రైలర్‌తో ‘జయమ్మ పంచాయితీ’ మంచి ఇంపాక్టే వేసింది. మరి సినిమాగా ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.