పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. పవన్ చేస్తున్న తొలి చారిత్రక నేపథ్యమున్న సినిమా ఇదే కావడం విశేషం. పవన్ ఇలాంటి భారీ, చారిత్రక నేపథ్యమున్న సినిమా చేయాలని అభిమానులు ఎప్పట్నుంచో కోరుకుంటున్నారు. ఎట్టకేలకు రెండేళ్ల కిందట క్రిష్ ఈ సినిమాను మొదలుపెట్టాడు. కాకపోతే ఈ చిత్రం అనుకున్న ప్రకారం ముందుకు సాగట్లేదు.
ముందు అనుకున్న ప్రకారం అయితే ఈపాటికే ‘హరిహర వీరమల్లు’ రిలీజైపోయి ఉండాలి. కానీ కరోనా సహా వేరే కారణాలు కూడా తోడై బాగా ఆలస్యం అవుతోందీ చిత్రం. ఇప్పటికి 50 శాతం చిత్రీకరణ మాత్రమే పూర్తయింది. పవన్‌కున్న వేరే కమిట్మెంట్ల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. ఐతే ఎట్టకేలకు పవన్ కాస్త తీరిక చేసుకుని ‘హరిహర వీరమల్లు’ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టడానికి నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం బ్యాగ్రౌండ్ వర్క్ నెల రోజుల నుంచి నడుస్తోంది.
పవన్ ఇటీవలే ‘హరి హర వీరమల్లు’ ప్రిపరేషన్లో భాగంగా క్రిష్ అండ్ టీంను కలిసిన ఫొటో బయటికి రావడం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా సెట్స్‌ను పవన్ సందర్శించాడు. లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ఈ సినిమాకు పని చేస్తుండటం విశేషం. ఒకప్పుడు ఇండియాలోనే టాప్ ప్రొడక్షన్ డిజైనర్లలో ఆయనొకరు. ‘అర్జున్’ కోసం మధుర మీనాక్షి ఆలయాన్ని తెలుగు గడ్డ మీద పున:ప్రతిష్ఠ చేసిన ఘనత ఆయన సొంతం. ఐతే గత కొన్నేళ్లలో సాబు సిరిల్, రవీందర్ లాంటి ప్రొడక్షన్ డిజైనర్ల హవా పెరిగింది.
తోట తరణికి వయసు మీద పడటం వల్ల కూడా ఆయన పెద్దగా సినిమాలు చేయట్లేదు. ఐతే క్రిష్ ఏరి కోరి ఆయన్ని పవన్ కోసం తీసుకొచ్చాడు. ఆయన నేతృత్వంలో భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోంది. కొత్త షెడ్యూల్లో కీలక సన్నివేశాలు ఈ సెట్స్‌లోనే చిత్రీకరించనున్నారు. పవన్ తరణిని కలిసి చర్చిస్తున్న ఫొటోను నిర్మాణ సంస్థ ట్విట్టర్లో పంచుకుంది. ఇంకొన్ని రోజల్లోనే ఈ సినిమా షూటింగ్ పున:ప్రారంభం కాబోతోంది. ఈ ఏడాదే సినిమాను పూర్తి చేసి 2023 సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర బృందం భావిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates