విరాటపర్వం.. దగ్గుబాటి రానా, సాయిపల్లవి, ప్రియమణిల ఆసక్తికర కాంబినేషన్లో నీదీ నాది ఒకే కథ చిత్రంతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు వేణు ఉడుగుల రూపొందించిన సినిమా ఇది. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. మొదలైన దగ్గర్నుంచి ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం చక్కటి ప్రోమోలతో ఇంకా అంచనాలు పెంచింది.
కానీ షూటింగ్ పూర్తయి చాలా కాలం అయినా ఈ సినిమా విడుదలకు నోచుకోవడం లేదు. గత ఏడాది వేసవిలోనే విరాటపర్వం ప్రేక్షకులను పలకరించాల్సింది. అప్పుడేమో కరోనా కారణంగా వాయిదా వేశారు. తర్వాత పరిస్థితులు బాగుపడ్డా సినిమా విడుదలకు నోచుకోలేదు. థియేట్రికల్ రిలీజ్ లేదు. ఓటీటీ డీల్ పూర్తయిందన్నారు. కానీ ఆ సంగతీ తేలలేదు. సురేష్ బాబు నిర్మాణంలోనే తెరకెక్కిన నారప్ప, దృశ్యం-2 చిత్రాలను ఓటీటీలో వదిలేశారు కానీ.. విరాటపర్వం సంగతే తేల్చలేదు.
ఓటీటీ డీల్ అయిపోయి ఉంటే అందులోనైనా వదిలేయాలి. కాదనుకుంటే థియేటర్లలోకి అయినా తీసుకురావాలి. ఏపీలో టికెట్ల రేట్ల విషయంలో అసంతృప్తి వల్లేమైనా సినిమాను ఆపి ఉంచారేమో అనుకుంటే.. ఇలాగే నెలలకు నెలలు గడిచిపోయి వడ్డీల భారం పెరుగుతూ వచ్చింది. ఈ మధ్యే టికెట్ల ధరల సమస్య కూడా తీరిపోయింది.
అయినా సరే.. విరాటపర్వం సినిమాను ఇప్పుడిప్పుడే విడుదల సూచనలైతే కనిపించడం లేదు. వేసవిలో సినిమాను రిలీజ్ చేసే ఉద్దేశం ఉంటే కనీసం ఏదో రకంగా సినిమాను వార్తల్లో నిలిపే ప్రయత్నం చేయాలి. ప్రమోషన్లు ప్లాన్ చేయాలి. కానీ ఏదీ లేకుండా దాదాపు ఏడాది నుంచి సినిమాను హోల్డ్ చేసి ఉంచడంలో సురేష్ బాబు అండ్ కో ఆలోచనేంటో అర్థం కావడం లేదు. ఇలాంటి క్రేజీ సినిమా ఎటూ కాకుండా పోవడం అభిరుచి ఉన్న ప్రేక్షకులకు రుచించడం లేదు.