రాధేశ్యామ్ త‌ట్టుకుంది కానీ..

గ‌త శుక్ర‌వారం భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజైన సినిమా రాధేశ్యామ్. క‌రోనా త‌ర్వాత బ‌డ్జెట్ ప‌రంగా చూసినా, రిలీజ్ విష‌యంలోనైనా ఇండియాలో ఇదే అతి పెద్ద సినిమా. పాన్ ఇండియా లెవెల్లో చాలా పెద్ద స్థాయిలో సినిమాను రిలీజ్ చేశారు. కానీ ఈ చిత్రం అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. తొలి రోజు బాగా డివైడ్ టాక్ తెచ్చుకుంది. సోష‌ల్ మీడియాలో ఈ సినిమాపై బాగా నెగెటివిటీ క‌నిపించింది.

రివ్యూలు కూడా ఏమంత ఆశాజ‌న‌కంగా లేవు. అయినా ఈ టాక్‌ను త‌ట్టుకుని సినిమా బాగానే నిల‌బ‌డింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాధేశ్యామ్ వ‌సూళ్లు నిల‌క‌డ‌గా సాగాయి. తొలి రోజుకు దీటుగా త‌ర్వాతి రెండు రోజుల్లో వ‌సూళ్లు వ‌చ్చాయి. ముఖ్యంగా ఆదివారం రాధేశ్యామ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర గ‌ట్టి ప్ర‌భావ‌మే చూపింది. తొలి రోజును మించి ఆదివారం వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్లుగా ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు.

డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు ఇలా క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌డం విశేష‌మే. మొత్తానికి వీకెండ్ వ‌ర‌కు రాధేశ్యామ్ విన్న‌ర్‌గా నిలిచింది. కానీ ఈ భారీ చిత్రంపై బ‌య్య‌ర్ల పెట్టుబ‌డుల లెక్క‌లు చూస్తే వీకెండ్ వ‌ర‌కు స‌త్తా చాటితే స‌రిపోదు. త‌ర్వాత కూడా సినిమా నిల‌క‌డ‌గా వ‌సూళ్లు సాధించాలి. వీక్ డేస్‌లో వ‌సూళ్లు కొంత త‌గ్గ‌డం ఏ సినిమాకైనా జ‌రిగేదే కానీ.. ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ వ‌చ్చిన నేప‌థ్యంలో డ్రాప్ ఎక్కువ ఉంటుందేమో అన్న భ‌యాలున్నాయి.

ఆర్ఆర్ఆర్ వ‌చ్చే వ‌ర‌కు సినిమా బ‌లంగా నిల‌బ‌డితే త‌ప్ప బ‌య్య‌ర్లు గ‌ట్టెక్క‌లేరు. ఉత్త‌రాదిన అయితే రాధేశ్యామ్ ప‌నైపోయిన‌ట్లే అంటున్నారు. హిందీ వెర్ష‌న్‌కు క‌శ్మీర్ ఫైల్స్ నుంచి గ‌ట్టి పోటీ ఎదుర‌వుతోంది. ఇప్పుడా సినిమానే పైచేయి సాధిస్తోంది. రాధేశ్యామ్ దాని ముందు నిల‌వ‌లేక‌పోతోంది. మ‌రి సోమ‌వారం నుంచి రాధేశ్యామ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఏమేర స‌త్తా చాటుతుందో చూడాలి.