బుచ్చిబాబు ముచ్చ‌ట్లు స‌రే.. కొర‌టాల క‌బుర్లేంటి?

జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమా కోసం అభిమానుల నిరీక్ష‌ణ దాదాపు మూడున్న‌రేళ్లుగా కొన‌సాగుతోంది. చివ‌ర‌గా 2018లో అర‌వింద స‌మేత‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన తార‌క్.. ఆ త‌ర్వాత ఆర్ఆర్ఆర్‌లో నిమ‌గ్న‌మైపోయాడు. 2020లోనే రావాల్సిన ఈ చిత్రం దాదాపు రెండేళ్లు ఆల‌స్యంగా 2022 మార్చి 25న ప్రేక్ష‌కుల ముంద‌కు రాబోతోంది.

రాజ‌మౌళి సినిమా అంటే ఆల‌స్యం అనివార్యం కానీ.. మ‌రీ ఇంత లేట‌వ‌డం ప‌ట్ల తార‌క్‌ అభిమానులు సంతోషంగా లేరు. ఐతే తార‌క్‌తో పాటు ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషించిన రామ్ చ‌ర‌ణ్ కాస్త న‌యం. అత‌ను 2019 సంక్రాంతికి విన‌య విధేయ రామ చిత్రాన్ని దించాడు. ఆర్ఆర్ఆర్ ప‌ని ముగియ‌గానే ఆల‌స్యం చేయ‌కుండా శంక‌ర్ చిత్రాన్ని మొద‌లుపెట్టేశాడు. ఇప్ప‌టికే ఈ చిత్రం మూడు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. 2022 సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. కానీ తార‌క్ ప‌రిస్థితి ఇలా లేదు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆర్నెల్ల ముందే పూర్త‌యినా.. ఇప్ప‌టిదాకా అత‌డి కొత్త చిత్రం ప‌ట్టాలెక్క‌లేదు.

కొర‌టాల శివ‌తో తార‌క్ త‌ర్వాతి సినిమా ఖ‌రారైంది కానీ.. అది ఎంత‌కీ సెట్స్ మీదికి వెళ్ల‌ట్లేదు. కొర‌టాల‌ ఆచార్యలో లాక్ అయిపోవ‌డం వ‌ల్లో, ఇంకో కార‌ణంతోనూ ఈ చిత్ర షూటింగ్ ఇంకా మొద‌లు కాలేదు. ఇప్పుడేమో తార‌క్ కొత్త సినిమా క‌బురు వినిపిస్తోంది. ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానాతో తార‌క్ చేయ‌బోయే స్పోర్ట్స్ డ్రామా అనౌన్స్‌మెంట్ ఏప్రిల్ తొలి వారంలో రాబోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

కానీ కొర‌టాల శివ సినిమా సంగ‌తేంటో చెప్ప‌కుండా.. దాన్ని మొద‌లుపెట్ట‌కుండా బుచ్చిబాబు సినిమా అనౌన్స్‌మెంట్ ఇస్తే ఏం లాభం అంటున్నారు తార‌క్ ఫ్యాన్స్. ముందు చేయాల్సిన సినిమా సంగ‌తేంటో తేల్చ‌కుండా ఆ త‌ర్వాత చేసే సినిమా ప్ర‌క‌ట‌న ఇస్తామంటే అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ ఏమీ క‌నిపించ‌డం లేదు. అందుకే ముందు కొర‌టాల సినిమా సంగ‌తి తేల్చాల‌ని వాళ్లు తార‌క్‌ను కోరుతున్నారు.