దక్షిణాది సినీ చరిత్రలో అత్యంత గొప్ప సంగీత దర్శకుడు ఎవరు అంటే మెజారిటీ సంగీత ప్రియుల నుంచి వచ్చే సమాధానం.. ఇళయరాజా. ఆయన సంగీతం ఎన్ని కోట్ల మందిని ఏ స్థాయిలో అలరించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
ఇక ఇళయరాజా ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ దక్షిణాది సినీ సంగీతాన్ని మరో స్థాయికి తీసుకెళ్లి తర్వాతి తరం సంగీత ప్రియుల మనసులు దోచిన మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్. తన పరిధిని బాలీవుడ్‌కే కాక హాలీవుడ్‌కు కూడా విస్తరించి.. రెండు ఆస్కార్ అవార్డులు కూడా సాధించిన ఘనుడు రెహమాన్.
వీళ్లిద్దరూ ఒకరి పట్ల ఒకరు పరస్పర గౌరవం, ప్రేమాభిమానాలు చూపిస్తుంటారు. రెహమాన్ ఎంత ఎదిగినా.. ఇళయరాజా ముందు చిన్నవాడిలాగే మసులుకుంటాడు. ఆయన పట్ల అమితమైన గౌరవభావాన్ని చూపిస్తాడు. ఇళయరాజా కూడా రెహమాన్ ఘనతల్ని గుర్తించి అతడి పట్ల అభిమానాన్ని చూపిస్తుంటాడు.
రెహమాన్ ఆస్కార్ అవార్డులు సాధించినపుడు అభినందన సభలో తన గురించి ఇళయరాజా గొప్పగా మాట్లాడాడు. ఇప్పుడీ లెజెండ్స్ ఇద్దరూ కలిసి పని చేయడానికి సిద్ధం కావడం విశేషం. తాజాగా రెహమాన్ ఆధ్వర్యంలో నడిచే ‘ఫిర్దాస్’ మ్యూజిక్ స్టూడియో ఇళయరాజా అతిథిగా విచ్చేశాడు.
రెహమాన్ తరహాలోనే సూట్ వేసుకుని అతడితో కలిసి ఈ స్టూడియో ఫొటోలకు పోజులిచ్చారు ఇళయరాజా. ఈ ఫొటోను రెహమాన్ సోషల్ మీడియాలో పంచుకుంటూ.. తమ స్టూడియోలో ప్రదర్శించేందుకు ఇళయరాజా భవిష్యత్తులో ఏదైనా కంపోజ్ చేసి ఇస్తే తానెంతో సంతోషిస్తానని పేర్కొన్నాడు.
దీనికి ట్విట్టర్ ద్వారానే ఇళయరాజా బదులివ్వడం విశేషం. రెహమాన్ విజ్ఞప్తిని మన్నిస్తున్నానని.. ఫిర్దాస్ స్టూడియో కోసం తన కంపోజిషన్ ఇస్తానని తెలిపాడు. దీంతో వీళ్లిద్దరి అభిమానులు ఈ కలయిక గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. సంగీత ప్రియులందరినీ వీరి కలయిక ఆకట్టుకుంటోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates