పశ్చిమ బెంగాల్లో మమతాబెనర్జీ హవా ఏమాత్రం తగ్గలేదు. తాజాగా జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కమలం పార్టీకి పెద్ద షాకే ఇచ్చింది. ఎన్నికలు జరిగిన 108 మున్సిపాలిటిల్లో తృణమూల్ ఏకంగా 102 మున్సిపాలిటిల్లో అఖండ విజయం సాధించింది. 108 మున్సిపాలిటీల్లో తృణమూల్ 102 మున్సిపాలిటీలను గెలుచుకోవటమంటే మామూలు విషయం కాదు.
తాజా ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయినట్లే అనుకోవాలి. సీపీఎంకు ఒక మున్సిపాలిటిలో విజయం సిద్ధించింది. కాకపోతే ఉప ప్రాంతీయ పార్టీ ఒక మున్సిపాలిటీలో విజయం సాధించటం అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేసింది. డార్జిలింగ్ మున్సిపాలిటీలో గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (జీఎన్ఎల్ఎఫ్) ఒక మున్సిపాలిటిలో ఘన విజయం సాధించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జీఎన్ఎల్ఎఫ్ అభ్యర్ధులు తృణమూల్, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్థులను ఓడించి మరీ ఘన విజయం సాధించటం.
సీపీఎం ఆధ్వర్యంలోని తహెర్ పూర్ మున్సిపాలిటిలో వామపక్షాల కూటమి గెలిచింది. మిగిలిన నాలుగు మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడినట్లు ఎన్నికల కమీషన్ ప్రకటించింది. అందరికన్నా ఎక్కువ స్థానాలు తృణమూలే గెలుచుకున్నా అధికారాన్ని అందుకునేందుకు అవపరమైన సంఖ్యాబలం మాత్రం దక్కించుకోలేకపోయింది. ఈ నాలుగు మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధులు ఎవరికి మద్దతిస్తే వాళ్ళదే మున్సిపాలిటి.
అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి నియోజకవర్గం నందిగ్రామ్ మున్సిపాలిటిలో కూడా తృణమూలే గెలిచింది. ఇక్కడ బీజేపీని గెలిపించేందుకు సువేందు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే నాలుగు దశాబ్దాలుగా ఈ మున్సిపాలిటీపై సువేందు అధికారి కుటుంబమే జెండా ఎగరేస్తోంది. మొదటిసారి జెండా సువేందు అధికారి కుటుంబంలో నుండి చేజారిపోవటం పెద్ద దెబ్బనే చెప్పాలి.
హోలు మొత్తం మీద ఎవరికీ అర్ధం కానిదేమంటే అసలు బీజేపీ నేతలకు ఏమైందనేది. ఎందుకంటే మమతను దెబ్బకొట్టాలని బీజేపీ నేతలు శతవిధాల ప్రయత్నించారు. 108 మున్సిపాలిటిల్లో బీజేపీ ఒక్కటంటే ఒక్కచోట కూడా గెలవకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ అంటే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పార్టీ కాబట్టి ఎక్కడా గెలవలేదంటే అర్ధముంది. మరి బీజేపీ నేతలకు ఏమైందో అర్థం కావటం లేదు. మొత్తం మీద మమతా బెనర్జీ ఫుల్లు హ్యాపీ అనే చెప్పాలి