ప‌వ‌న్.. ఈసారైనా అందుకుంటాడా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వ‌చ్చింది. భీమ్లా నాయ‌క్ విడుద‌ల ఈ రోజే. ఇది మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్య‌ప్ప‌నుం కోషీయుంకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రాన్ని ప్ర‌క‌టించిన‌పుడు రీమేకే క‌దా అని లైట్ తీసుకున్నారు జ‌నాలు. కానీ ప‌వ‌న్ సినిమా అంటే.. రీమేక్ అయినా, స్ట్రెయిట్ అయినా, ఏ కాంబినేష‌న్లో చేసినా.. విడుద‌ల స‌మ‌యానికి హైప్ ఆటోమేటిగ్గా వ‌చ్చేస్తుంది.

భీమ్లా నాయ‌క్‌కు హైప్ ఇంకాస్త ఎక్కువే వ‌చ్చింది. భీమ్లా నాయ‌క్‌కు సంబంధించిన ప్ర‌తి ప్రోమో కూడా ఎగ్జైటింగ్‌గా ఉండ‌టంతో రిలీజ్ టైం వ‌చ్చేస‌రికి క్రేజ్ మ‌ల్టిప్లై అవుతూ వ‌చ్చింది. ఇప్పుడు ఈ సినిమా కోసం అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కులు కూడా తీవ్ర ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వ‌సూళ్ల మోత మోగించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జ‌రిగాయి భీమ్లా నాయ‌క్‌కు.

ఐతే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం టికెట్ల నియంత్ర‌ణ కొన‌సాగుతుండ‌టంతో వ‌సూళ్ల‌పై గ‌ట్టి ప్ర‌భావ‌మే ప‌డేలా ఉంది. అయిన‌ప్ప‌టికీ సినిమాపై ఉన్న హైప్ చూస్తుంటే.. ప‌వ‌న్ అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న ఓ ఘ‌న‌త‌ను ఈ సినిమాతో ప‌వ‌ర్ స్టార్ అందుకుంటాడ‌నే అనిపిస్తోంది. ప‌వ‌న్ త‌ర్వాత వ‌చ్చిన హీరోలు కూడా వంద కోట్ల షేర్ మార్కును ట‌చ్ చేయ‌గా.. స‌రైన టైంలో స‌రైన సినిమాలు ప‌డ‌క ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఇంకా ఆ క్ల‌బ్బులో చేర‌లేదు.

గ‌త ఏడాది వ‌కీల్ సాబ్‌తో క్ల‌బ్బులో అడుగు పెట్టేలాగే క‌నిపించాడు కానీ.. ఏపీలో టికెట్ల రేట్ల త‌గ్గింపుకు తోడు.. కొవిడ్ కార‌ణంగా మ‌ధ్య‌లో థియేట్రిక‌ల్ ర‌న్ ఆగిపోవ‌డంతో 90 కోట్ల‌ ప్ల‌స్ షేర్‌తో స‌రిపెట్టుకుంది ఆ చిత్రం. ఐతే భీమ్లా నాయ‌క్‌కు ఉన్న క్రేజ్.. తెలంగాణ‌లో టికెట్ల రేట్ల పెంపు.. తెలుగు రాష్ట్రాల అవ‌త‌ల కూడా సినిమాకున్న క్రేజ్, భారీ రిలీజ్ దృష్ట్యా వంద కోట్ల షేర్ మార్కును ట‌చ్ చేసేలాగే క‌నిపిస్తోంది.