తెలుగు రాష్ట్రాల అవతల మార్కెట్ సంపాదించాలని.. పాన్ ఇండియా లెవెల్లో ఎదిగిపోవాలని అందరు స్టార్ హీరోలకూ ఉంది. కానీ అందరికీ పరిస్థితులు కలిసి రావు. ఇప్పటిదాకా అయితే ప్రభాస్ మాత్రమే పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్ అయ్యాడు. అదంతా ‘బాహుబలి’ పుణ్యమే. ఇటీవల అల్లు అర్జున్ ‘పుష్ప’తో తన మార్కెట్‌ను పాన్ ఇండియా లెవెల్లో ఓ మోస్తరుగా విస్తరించాడు. మిగతా స్టార్ హీరోలు ఇంతకుముందు ప్రయత్నించారు.
ఇంకా ట్రై చేస్తున్నారు. వీరిలో ఎంతమంది ఈ ప్రయత్నంలో విజయవంతమవుతారో చూడాలి. ఇటీవల రవితేజ తన ‘ఖిలాడి’ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయించాడు. కానీ ఫలితం లేకపోయింది. సరైన ప్రమోషన్ లేకపోవడం, సినిమాలో విషయం కూడా తక్కువైపోవడంతో దీన్ని హిందీ ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఆ సినిమాకు నార్త్ మార్కెట్లో రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి రాని పరిస్థితి. కాగా టాలీవుడ్ కొత్త రిలీజ్ ‘భీమ్లా నాయక్’ను కూడా నార్త్ మార్కెట్లోకి తీసుకెళ్లాలని నిర్మాతలు అనుకున్నారు. ‘భీమ్లా నాయక్’ను తెలుగుతో పాటు హిందీలోనూ పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.
కానీ రిలీజ్ దగ్గర పడేసరికి నిర్మాతల ఆలోచన మారిపోయినట్లు తెలుస్తోంది. సినిమాను ఏమాత్రం ప్రమోట్ చేయకుండా హడావుడిగా రిలీజ్ చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదని భావిస్తున్నారట. ‘పుష్ప’కు రిలీజ్ ముంగిట అనుకున్న స్థాయిలో ప్రమోషన్లు లేకపోయినా.. చాలా ముందు నుంచే హిందీలో పాటలు, ఇతర ప్రోమోలు రిలీజ్ చేస్తూ అక్కడి జనాల్ని ప్రిపేర్ చేశారు.
దానికి రిలీజ్ టైమింగ్ కూడా బాగా కుదిరింది. కానీ ‘భీమ్లా నాయక్’ హిందీలో రిలీజవుతుందనే అధికారిక ప్రకటన ఇప్పటిదాకా రాలేదు. పైగా ఈ శుక్రవారం ‘గంగూబాయి కతియావాడీ’ హిందీలో పెద్ద ఎత్తున రిలీజవుతోంది. ఇంకోవైపేమో ‘భీమ్లా నాయక్’ ఒరిజినల్ ‘అయ్యప్పనుం కోషీయుం’ను హిందీలో రీమేక్ చేయబోతున్న నిర్మాతల నుంచి ఒత్తిడి కూడా వస్తోంది. దీంతో ప్రస్తుతానికి ‘భీమ్లా నాయక్’ హిందీ రిలీజ్‌ను ఆపినట్లుగా తెలుస్తోంది.