ఇది నిజంగా దిమ్మదిరిగే షాకే. భీమ్లా నాయక్ వాయిదా పడటం పక్కా అన్న ఉద్దేశంతో ఫిబ్రవరి 25కే మూణ్నాలుగు సినిమాలు షెడ్యూల్ అయిపోయాయి. శర్వానంద్ సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్లును ఆ రోజుకు ఖాయం చేసి ప్రమోషన్లు కూడా జోరుగా చేస్తున్నారు. వరుణ్ తేజ్ సినిమా గనికి కూడా మంగళవారమే విడుదల తేదీ ఖరారు చేశారు.
ఫిబ్రవరి 25కే ఆ సినిమా కూడా ఖరారైంది. మరోవైపు సెబాస్టియన్ అనే చిన్న సినిమా కూడా ఆ రోజే రావాల్సి ఉంది. ఇక తమిళ అనువాద చిత్రం వలిమైను కూడా ఆ రోజుకు ఖాయం చేశారు. భీమ్లా నాయక్ వాయిదా అని అధికారిక ప్రకటన రాకపోయినా.. అది లాంఛనమే అన్న ఉద్దేశంతో మిగతా సినిమాలన్నీ ఫిబ్రవరి చివరి వారానికి వచ్చేద్దామని ధీమాగా ఉన్నాయి. కానీ అందరికీ దిమ్మదిరిగే షాకిచ్చింది భీమ్లా నాయక్ టీం.
ఈ సినిమాను ముందు అనుకున్నట్లే ఫిబ్రవరి 25కు ఖాయం చేస్తూ కొత్త పోస్టర్ వదిలారు. భీమ్లా నాయక్ షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లే. ప్రస్తుతం చివరి పాట చిత్రీకరణ నడుస్తోంది. ఆ పాట నుంచే కొత్త పోస్టర్ రిలీజ్ చేశారిప్పుడు. బుధవారమే గుమ్మడికాయ కొట్టబోతున్నారు. ఇంకో రెండు రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ చేసి 18 లేదా 19న సెన్సార్ చేయించాలని చూస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో నైట్ కర్ఫ్యూ, థియేటర్లలో 50 పర్సంట్ ఆక్యుపెన్సీ ఎప్పుడు ఎత్తి వేస్తారన్నదాన్ని బట్టి భీమ్లా నాయక్ రిలీజ్ ఆధారపడి ఉంటుందని నిర్మాత నాగవంశీ ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు.
తాజాగా ఏపీలో నైట్ కర్ఫ్యూ తీసేశారు. ఆక్యుపెన్సీని కూడా వంద శాతానికి పెంచడం లాంఛనమే అంటున్నారు. టికెట్ల రేట్ల విషయంలో మాత్రం సందిగ్ధత నడుస్తోంది. అయినప్పటికీ ఈ నెల 25న సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయింది చిత్ర బృందం. భీమ్లా నాయక్ రంగంలోకి దిగుతున్నాడు కాబట్టి గని, ఆడవాళ్ళు మీకు జోహార్లు, సెబాస్టియన్ రేసు నుంచి తప్పుకోక తప్పదు. అనువాద చిత్రం వలిమై మాత్రం వచ్చే అవకాశముంది.