`మానాడు` కోసం పోటీ ప‌డుతున్న బావ బావమరిది !

కోలీవుడ్ స్టార్ హీరో శింబు న‌టించిన చిత్ర‌మే `మానాడు`. వెంకట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో క‌ల్యాణి ప్ర‌యద‌ర్శ‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. ఎస్‌.జె. సూర్య విల‌న్‌గా చేశాడు. టైం లూప్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ గ‌త ఏడాది విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. శింబుకు ప‌ర్ఫెక్ట్ కంబ్యాక్ చిత్రంగా నిలిచిన మానాడులో ఎస్‌.జె.సూర్య సైతం అద్భుత‌మైన న‌ట‌న‌ క‌న‌బ‌రిచి విమ‌ర్శ‌కుల చేత ప్ర‌శంస‌లు అందుకున్నాడు.

అయితే ఈ సూప‌ర్ హిట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ఎప్ప‌టి నుంచో స‌న్నాహాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్ ఈ మూవీ రీమేక్ రైట్స్‌ను భారీ ధ‌ర‌కు సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రంలో హీరో ఎవ‌ర‌న్న‌ది హాట్ టాపిక్‌గా మార‌గా.. చాలా మంది పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి.

కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రి పేరు మీద ఈ రీమేక్‌ను ప్ర‌క‌టించ‌లేదు. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. టాలీవుడ్‌కి చెందిన బావ బావ‌మ‌రిది ఈ మూవీ కోసం పోటీ ప‌డుతున్నార‌ట‌. ఇంత‌కీ ఆ బావ బావ‌మ‌రిది ఎవ‌రో కాదు రానా ద‌గ్గుబాటి – నాగచైత‌న్య‌. వీరిద్ద‌రికీ మానాడు స్టోరి బాగా న‌చ్చేసింద‌ట‌. ఈ నేప‌థ్యంలోనే రానా, చైతులిద్ద‌రూ మానాడు తెలుగు రీమేక్ చేసేందుకు ముందుకు వ‌చ్చార‌ట‌.

ఇక త్వ‌ర‌లోనే వీరిద్ద‌రిలో ఒక‌రిని నిర్మాత సురేష్ బాబు ఫైన‌ల్ చేసి.. అధికారికంగా మానాడు తెలుగు రీమేక్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయ‌నున్నార‌ని టాక్ న‌డుస్తోంది. అంతేకాదు, ఒరిజినల్‌ను తెర‌కెక్కించిన వెంక‌ట్ ప్ర‌భునే తెలుగులో కూడా డైరెక్ట్ చేయబోతున్నాడ‌ని స‌మాచారం.