ప్రభుత్వం వరమిచ్చినా.. హీరోలు కరుణించట్లేదు

సినిమా షూటింగులకు అనుమతులిప్పించుకోవడం కోసం టాలీవుడ్ పెద్దలు ఎంతగా కష్టపడ్డారో అందరూ చూశారు. ఇందుకోసం రెండు నెలల కిందట్నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. లాక్ డౌన్ తొలి దశ పూర్తవుతున్న సమయంలోనే కొందరు సినీ ప్రముఖులు.. ప్రభుత్వ పెద్దలతో షూటింగుల గురించి మాట్లాడారు. కానీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు.

ఆ తర్వాత సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు, దిల్ రాజు, రాజమౌళి లాంటి వాళ్లు ఇటు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, అటు ముఖ్యమంత్రి కేసీఆర్‌లతో మాట్లాడారు. తలసాని మరోసారి కూడా సమావేశం నిర్వహించారు.

ఇంత చర్చ జరిగాక కూడా కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి చివరికి ఈ మధ్యనే షూటింగులకు అనుమతులిచ్చారు. కానీ షూటింగ్స్‌కు ఓకే అంటూనే చాలా షరతులు పెట్టడంతో నిర్మాతలకు ఏం చేయాలో పాలుపోలేదు.

పరిమిత సంఖ్యలో కాస్ట్ అండ్ క్రూ.. పీపీఈ కిట్లు.. శానిటైజేషన్.. మాస్కులు.. అంటూ చాలా షరతులు పెట్టడంతో ఇన్ని పరిమితుల మధ్య షూటింగ్స్ ఎలా చేస్తామో.. ఎక్కువమందితో చేయాల్సిన సన్నివేశాల మాటేంటి అనుకుంటూనే నిర్మాతలు ప్లానింగ్‌లోకి దిగారు. ఐతే వాళ్లు అన్నిటికీ సిద్ధపడి షూటింగ్ చేయాలనుకుంటుంటే.. టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం వెంటనే షూటింగ్స్‌కి రావడానికి నో అంటున్నట్లు సమాచారం. వాళ్లందరూ కరోనాకు భయపడుతున్నారట. ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనా పతాక స్థాయిని అందుకుంది. ప్రస్తుతం తెలంగాణలో రోజూ వందల్లో కేసులు నమోదవుతున్నాయి. అందులో మెజారిటీ జీహెచ్ఎంసీ పరిధిలోనివే.

ప్రభుత్వం లాక్‌డౌన్‌ షరతులన్నీ ఎత్తేశాక కరోనా విజృంభిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎంత జాగ్రత్త పడ్డా కూడా షూటింగ్స్ చేయడం అంత మంచిది కాదని హీరోలు భావిస్తున్నారు. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణకు సంబంధించి.. ముందు ట్రయల్ షూట్ చేసి ఆ తర్వాత రంగంలోకి దిగుదామనుకున్నాడు కానీ.. ఇప్పుడు ఆయన, తన టీం కూడా ఈ పరిస్థితుల్లో షూటింగ్ చేయడం కరెక్టేనా అని ఆలోచనలో పడ్డట్లు చెబుతున్నారు. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా నివురు గప్పిన నిప్పులా ఉందని.. పరిస్థితులు చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సినీ జనాలు షూటింగ్స్‌కు భయపడుతున్నారు.