అజిత్ సినిమాకు ఏమిటీ బిల్డ‌ప్‌?

వ‌లిమై.. త‌మిళ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌డైన అజిత్ కుమార్ హీరోగా తెర‌కెక్కిన భారీ చిత్రం. అజిత్‌తో ఇంత‌కుముందు నీర్కొండ పార్వై (పింక్ రీమేక్‌) సినిమా తీసిన హెచ్.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో ఆ చిత్ర నిర్మాత బోనీ క‌పూరే దీన్ని నిర్మించాడు. ఈ సినిమాపై త‌మిళంలో భారీ అంచ‌నాలే ఉన్నాయి. వినోద్ ఇంత‌కుముందు శ‌తురంగ వేట్టై, ఖాకి లాంటి మంచి థ్రిల్ల‌ర్లు తీశాడు. పింక్ రీమేక్ త‌ర్వాత ఒరిజిన‌ల్ స్క్రిప్టుతో అజిత్‌ను పెట్టి రేసీ థ్రిల్ల‌రే తీసిన‌ట్లున్నాడు.

మ‌న యంగ్ హీరో కార్తికేయ విల‌న్ పాత్ర పోషించిన ఈ సినిమా ట్రైల‌ర్‌తో బాగానే ఆక‌ట్టుకుంది. ఐతే ట్రైల‌ర్ ఎంత బాగున్నా.. కార్తికేయ విల‌న్ పాత్ర చేసినా.. అజిత్‌కు తెలుగులో మార్కెట్ అంతంత‌మాత్ర‌మే. కెరీర్ ఆరంభంలో వ‌చ్చిన ప్రేమ‌లేఖ మిన‌హాయిస్తే తెలుగులో అజిత్ సినిమాలేవీ పెద్ద‌గా ఆడింది లేదు. త‌మిళంలో కొంద‌రు చిన్న హీరోలు కూడా తెలుగులో మార్కెట్ సంపాదించారు కానీ.. అజిత్ మాత్రం ఇక్క‌డ అనుకున్నంత‌గా ఎద‌గ‌లేక‌పోయాడు.

ఐతే వ‌లిమైకు ఉన్న కొన్ని ఆక‌ర్ష‌ణ‌లు తోడై తెలుగులోనూ ఈ సినిమా బాగా ఆడుతుందేమో అన్న ఆశ‌లున్నాయి. ఈ నెల 24న విడుద‌ల కానున్న వ‌లిమైకి త‌మిళంలో మంచి టాక్ వ‌స్తే రికార్డుల మోత మోగ‌డం ఖాయం. కానీ త‌మిళ‌నాడు అవ‌త‌ల ఈ సినిమాను ఏమాత్రం ప‌ట్టించుకుంటార‌న్న‌దే డౌటు. తెలుగులో ఆడ‌వాళ్లు మీకు జోహార్లు, సెబాస్టియ‌న్ లాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ ఆ వీకెండ్‌కు షెడ్యూల్ అయి ఉన్నాయి. ప‌రిస్థితులు బాగుంటే వీటిని ప‌క్క‌కు త‌ప్పించి భీమ్లా నాయ‌క్ వ‌చ్చే అవ‌కాశాల‌నూ కొట్టి పారేయ‌లేం.

గ‌ని సైతం ఆ వీకెండ్ కోసం ఎదురు చూస్తోంది. ఇంత పోటీలో అజిత్ సినిమా తెలుగులో ప్ర‌భావం చూప‌డం డౌటే. హిందీలో గంగూబాయి రిలీజ‌వుతున్న నేప‌థ్యంలో అక్క‌డా అజిత్ సినిమాకు ఛాన్స్ లేన‌ట్లే. ఐతే ఈ సినిమాకు లేని హైప్ సృష్టించ‌డం కోసం ముంబ‌యిలో ఒక స్పెష‌ల్ ప్రిమియ‌ర్ వేసి పీఆర్వోలు, సినీ ప్ర‌ముఖుల‌తో సినిమా గురించి ఆహా ఓహో అని ట్వీట్లు వేయిస్తున్నారు. హిందీలో పుష్పను మించి ఈ సినిమా ఆడేస్తుంద‌ని పొగిడేస్తున్నారు. కానీ వ‌లిమై ఎంత బాగున్నా.. హిందీలో, తెలుగులో ఉన్న పోటీ దృష్ట్యా ఏమాత్రం ప్ర‌భావం చూపుతుంద‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మే.