ఆ ద‌ర్శ‌కుడిని అస‌లు గుర్తించ‌రా?

 
భీమ్లా నాయ‌క్ టెక్నిక‌ల్ టీం గురించి ప్ర‌స్తావిస్తే ముందుగా అంద‌రికీ గుర్తుకొస్తున్న పేరు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌దే. మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్య‌ప్ప‌నుం కోషీయుంకు రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ఆయ‌న స్క్రీన్ ప్లే, మాట‌లు అందించారు. కానీ ఆయ‌న పాత్ర స్క్రిప్టు వ‌ర‌కే ప‌రిమితం కాలేదు. ఈ సినిమా చూసి రీమేక్ చేద్దామ‌ని నిర్మాత‌లు చిన‌బాబు, నాగ‌వంశీల‌కు చెప్పిందే త్రివిక్ర‌మ్ అని.. అలాగే ప‌వ‌న్‌ను ఒప్పించి ఈ సినిమా చేయించింది కూడా ఆయ‌నే అని అంటారు.

ఐతే సినిమాకు స‌న్నాహాలు చేయించ‌డం, స్క్రిప్టు రాయ‌డం వ‌ర‌కు ప‌రిమితం కాకుండా.. ఆ త‌ర్వాత కూడా మేకింగ్‌లో త్రివిక్ర‌మ్ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. పేరుకు మాత్ర‌మే ఈ చిత్రానికి సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌కుడ‌ని, త్రివిక్ర‌మే అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌నే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఈ సినిమా మేకింగ్ వీడియోలు చూసినా అదే ఫీలింగ్ క‌లుగుతోంది.

ఐతే బ‌య‌టి వాళ్లు ఏమ‌నుకున్నా.. యూనిట్ స‌భ్యులు సైతం సాగ‌ర్ చంద్ర‌ను ద‌ర్శ‌కుడిగా గుర్తించ‌క‌పోవ‌డ‌మే ఆశ్చ‌ర్యం. ఈ చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ ఓ టీవీ షోలో భాగంగా భీమ్లా నాయ‌క్ గురించి మాట్లాడారు. ఆ ప్ర‌స్తావ‌న రాగానే త్రివిక్ర‌మ్ గారు బెస్ట్ ఫిలిం అందించారు అన్నాడు. అలాగే ఆయ‌న‌తో క‌లిసి సినిమా చూశాన‌ని.. ఔట్ పుట్ చాలా బాగా వ‌చ్చింద‌ని.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో ఇది బెస్ట్ ఫిలిం అని కూడా చెప్పాడు.

ఈ చిత్రానికి త‌న వంతుగా ఏమాత్రం త‌గ్గ‌కుండా బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాన్నాడు. ఇప్పుడే కాదు.. ముందు కూడా భీమ్లా నాయ‌క్ పేరెత్తితే త్రివిక్ర‌మ్ గురించే మాట్లాడుతున్నాడు త‌మ‌న్. అలా కాదంటే ప‌వ‌న్నామ‌స్మ‌ర‌ణ చేస్తాడు. కానీ ద‌ర్శ‌కుడిగా సాగ‌ర్ చంద్ర‌ను మాత్రం గుర్తించి అత‌డి గురించి ఏమీ మాట్లాడ‌ట్లేదు. చూస్తుంటే ఈ సినిమా స‌క్సెస్ అయినా ఎవ్వ‌రూ సాగ‌ర్ గురించి మాట్లాడేలా లేరు. క్రెడిట్ అంతా త్రివిక్ర‌మ్ ఖాతాలోకే వెళ్లేలా ఉంది.