నాని నెగిటివ్ రోల్.. నమ్మొచ్చా?

ఓ నటుడిలోని అసలైన టాలెంట్‌ని బయటికి తీసుకొచ్చేది నెగిటివ్ క్యారెక్టర్లే. అందుకే చాలాసార్లు హీరోలు సైతం నెగిటివ్‌గా కనిపించేందుకు రెడీ అవుతారు. భల్లాలదేవగా రానా అదరగొట్టాడు. బాలీవుడ్‌ ‘భాగీ’లో సుధీర్‌‌ బాబు దుష్టపాత్రలో భయపెట్టాడు. ‘గద్దలకొండ గణేష్‌’గా వరుణ్ తేజ్ కూడా విలనీని పండించాడు.       

అందుకే ‘వి’ సినిమాలో నాని నెగిటివ్ రోల్ చేస్తున్నాడనే వార్త విని అందరూ చాలా ఎక్సయిటయ్యారు. కూల్‌గా, పక్కింటి అబ్బాయిలా ఉండేవాడు ప్రతినాయకుడిగా ఎలా ఉంటాడో చూడాలనుకున్నారు. కానీ సినిమా చూశాక అంచనాలన్నీ తలకిందులయ్యాయి. నాని విలన్‌లా కాక హీరోలానే కనిపించాడు ప్రేక్షకుల కళ్లకి.       

ఇప్పుడు నాని నెగిటివ్‌గా కనిపించబోతున్నాడనే వార్త మరోసారి వినిపిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ అనే సినిమాకి కమిటయ్యాడు నాని. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో తన పాత్ర నెగిటివ్‌గానే ఉంటుందని తెలిసింది.

ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించని లుక్‌లో కనిపిస్తాడని, అతని పాత్ర ప్రేక్షకుల్ని సర్‌‌ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.  ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌ చూస్తే కూడా అది నిజమేనేమో అనిపిస్తోంది. ఈ పోస్టర్‌‌లో నెగిటివ్ షేడ్స్ ఫుల్లుగా ఉన్నాయి. గుబురు గడ్డం, చెదిరిన జుట్టు, ఎర్రబారిన కళ్లతో కాస్త క్రూయెల్‌గానే కనిపిస్తున్నాడు నాని. మరి ఈసారైనా నెగిటివిటీతో  భయపెట్టగలుగుతాడా లేదా అనేది చూడాలి.