తమిళ దర్శకుడితో అల్లరోడు!

కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ తన కెరీర్ లో ఎన్నో హిట్టు సినిమాల్లో నటించారు. గత కొన్నేళ్లలో మాత్రం ఆయన వరుస ఫ్లాప్ లు చవిచూశారు. దీంతో రూటు మార్చి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. ‘మహర్షి’ సినిమాలో అల్లరోడి యాక్టింగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అదే తరహా సీరియస్ సినిమాలు చేస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘నాంది’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 

ఈ సినిమా ఆడియన్స్ కి ఒక సర్ప్రైజ్ అనే చెప్పాలి. నిర్మాతలకు కూడా మంచి లాభాలను తీసుకొచ్చింది. ఈ హిట్టు సినిమా తరువాత ‘సభకు నమస్కారం’ అనే మరో సినిమా అంగీకరించారు అల్లరి నరేష్. మల్లంపాటి సతీష్ దర్శకత్వంలో మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మించాల్సి వుంది. కానీ నిర్మాత హఠాన్మరణం కారణంగా ఈ ప్రాజెక్ట్ కి బ్రేక్ పడింది. మరో ప్రొడ్యూసర్ తో ఈ సినిమా ముందుకెళ్తుందని అంటున్నారు. 

ఇదిలా ఉండగా.. అల్లరి నరేష్ తాజాగా ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి అంగీకరించారట. అతడొక తమిళ దర్శకుడని తెలుస్తోంది. రాజా మోహన్ అనే కొత్త దర్శకుడు ఇటీవల నరేష్ ని కలిసి కథ వినిపించారట. స్టోరీ డిఫరెంట్ గా ఉండడంతో నరేష్ కూడా వెంటనే సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. 

ప్రముఖ రచయిత అబ్బూరి రవి.. ఈ ప్రాజెక్ట్ ను అల్లరి నరేష్ దగ్గరకు తీసుకొచ్చినట్లు సమాచారం. ఇంకా నిర్మాత ఎవరనేది ఫిక్స్ అవ్వలేదు. కానీ ప్రాజెక్ట్ మాత్రం పక్కా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఒకవేళ ‘సభకు నమస్కారం’ సినిమా ఆలస్యమైతే గనుక ముందుగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.