పార్టీ చేసుకో పుష్పా

పుష్ప సినిమాకు తొలి రోజు వ‌చ్చిన టాక్ చూస్తే సినిమా ప‌రిస్థితి ఏమ‌వుతుందో ఏమో అన్న ఆందోళ‌న క‌లిగే ఉంటుంది చిత్ర బృందంలో. కానీ టాక్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ తొలి వీకెండ్లో ఆ సినిమాకు వ‌సూళ్ల ప‌రంగా ఢోకానే లేక‌పోయింది. రికార్డు స్థాయిలో వ‌సూళ్లు రాబ‌డుతూ పుష్ప దూసుకెళ్లింది. ఆంధ్రా ప్రాంతంలో మిన‌హాయిస్తే అన్ని చోట్లా సినిమాకు భారీ వ‌సూళ్లు వ‌చ్చాయి. ఏపీలో కూడా టికెట్ల రేట్లు త‌క్కువ‌గా ఉండ‌టంతో దెబ్బ ప‌డింది.

ఫ‌స్ట్ వీకెండ్ త‌ర్వాత కొంచెం జోరు త‌గ్గినా.. మ‌ళ్లీ వీకెండ్ వ‌చ్చేస‌రికి మంచి వ‌సూళ్లు వ‌చ్చాయి. క్రిస్మ‌స్ వీకెండ్‌ను ఆ సినిమా బాగా ఉప‌యోగించుకుంది. రెండో వారం వ‌చ్చిన శ్యామ్ సింగ‌రాయ్‌కి ఓ మోస్త‌రు టాకే రావ‌డం.. త‌ర్వాతి వారం చెప్పుకోద‌గ్గ రిలీజ్ లేక‌పోవ‌డం పుష్ప‌కు క‌లిసొచ్చింది. ఈ వీకెండ్లో బాక్సాఫీస్‌ను లీడ్ చేస్తోంది పుష్ప మూవీనే.
తెలుగు రాష్ట్రాల కంటే కూడా దేశంలోని మిగ‌తా రాష్ట్రాల్లో పుష్ప ఆయా భాష‌ల్లో అద‌ర‌గొడుతోంది.

హిందీ, త‌మిళం, మ‌ల‌యాళ వెర్ష‌న్లు సూప‌ర్ హిట్ స్థాయికి అందుకున్నాయి. తెలంగాణ‌లో ఈ వీకెండ్ సినిమా లాభాల బాట ప‌ట్టేలా క‌నిపిస్తోంది. ఐతే పుష్ప జోరు ఈ వీకెండ్‌కే ప‌రిమితం అని.. ఇంత‌టితో ఆ సినిమా థియేట్రిక‌ల్ ర‌న్ ముగిసిన‌ట్లే అని అనుకున్నారు. కానీ ఈ సినిమాకు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భ‌లేగా క‌లిసొస్తోంది. ఈ వీకెండ్లో జెర్సీ హిందీ వెర్ష‌న్ రిలీజ్ కాక‌పోవ‌డం వ‌ల్ల నార్త్ ఇండియాలో పుష్ప‌కు ఎదురే లేకుండా పోయింది.

ఇప్పుడేమో వ‌చ్చే వారం రావాల్సిన ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా ప‌డిపోయింది. ఇప్పుడు హ‌డావుడిగా కొత్త సినిమాలేవీ వ‌చ్చే వారం రిలీజ‌య్యే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. ఇది దేశ‌వ్యాప్తంగా పుష్ప‌కు క‌లిసొచ్చే అంశ‌మే. ఈ సినిమా థియేట్రిక‌ల్ ర‌న్ ఇంకొన్ని రోజులు ఎక్స్‌టెండ్ అయింది. వ‌చ్చే వారం కూడా బాక్సాఫీస్ లీడ‌ర్ పుష్ప‌నే కాబోతోంది. ఏపీలో మిన‌హా అన్ని చోట్లా పుష్ప లాభాలు భారీ స్థాయిలోనే ఉండబోతున్నాయ‌న్న‌ది స్ప‌ష్టం.