భీమ్లా టీం ఉరుకులు పరుగులు

‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడబోతున్నట్లుగా శుక్రవారం రాత్రి సంకేతాలు అందాయో లేదో.. ‘భీమ్లా నాయక్’ టీం అలెర్ట్ అయిపోయింది. ఈ చిత్రాన్ని తిరిగి సంక్రాంతి రేసులోకి తీసుకురావడానికి హడావుడిగా సన్నాహాలు మొదలుపెడుతున్నట్లు సమాచారం. ఆ చిత్రం ముందు అనుకున్న ప్రకారం 12న రావాల్సింది. రెండు వారాల ముందు వరకు ఆ డేట్‌కే కట్టుబడి ఉన్నారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ టీం సభ్యుులు, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు కలిసి పట్టుబట్టి ఈ చిత్రాన్ని వాయిదా వేయించారు.

సంక్రాంతి రేసు నుంచి తప్పించి ఫిబ్రవరి నెలాఖరుకు సినిమాను వాయిదా వేయించారు. దీంతో ‘భీమ్లా నాయక్’ టీం రిలాక్స్ అయిపోయింది. తాపీగా టాకీ పార్ట్, పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుందాంలే అనుకుంది. కొంచెం టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉన్నప్పటికీ, తర్వాత చూసుకుందాంలే అని పవన్ తన భార్యతో కలిసి క్రిస్మస్ వేడుకల కోసం రష్యాకు వెళ్లిపోయాడు. ఆయనక్కడ రిలాక్స్ అవుతుండగానే ఇక్కడ హడావుడిగా పరిస్థితులు మారిపోయాయి.

నిన్న రాత్రి నుంచి భీమ్లా టీం అలెర్ట్ అయి.. వెంటనే త్రివిక్రమ్, సాగర్ చంద్ర, నాగవంశీ.. అందుబాటులో ఉన్న మిగతా యూనిట్ సభ్యులు సమావేశం అయి సినిమా స్టేటస్ ఏంటి.. ఎన్ని రోజులు మిగిలుంది.. బ్యాలెన్స్ షూటింగ్‌కు ఎంత టైం పడుతుంది.. ఏ తేదీని సినిమాను రిలీజ్ చేయగలం అనే అంశాలను సమీక్షిస్తున్నట్లు తెలిసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక‌ట్రెండు రోజుల్లో హైద‌రాబాద్ చేరుకుంటాడ‌ని, బ్యాలెన్స్ ఉన్న స‌న్న‌వేశాల‌ను కొన్ని రోజుల్లోనే పూర్తి చేస్తారని.. దీనికి స‌మాంత‌రంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జ‌రుగుతాయ‌ని.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప‌ది రోజుల్లో సినిమాను రెడీ చేయాల‌న్న త‌లంపుతో ఉన్నార‌ని తెలుస్తోంది.

ఐతే అన్నీ అనుకున్న‌ట్లు జ‌రుగుతాయో లేదో అన్న భ‌యం కూడా ఉంది. అందుకే ముందే రిలీజ్ డేట్ మాత్రం ప్ర‌క‌టించే అవ‌కాశాలు లేదు. వారం త‌ర్వాత ఒక స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని.. సంక్రాంతికి రాగ‌లం అనుకుంటే రిలీజ్ డేట్ ఇచ్చి ముందుకెళ్లిపోతార‌ని.. సినిమాకు కావాల్సినంత హైప్ ఉంది కాబ‌ట్టి ప్ర‌మోష‌న్ల గురించి కూడా భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేద‌ని చిత్ర బృందం భావిస్తోంద‌ట‌.