బాలయ్యకు ఇచ్చి.. బన్నీకి ఆపారేంటి?

ఆంధ్రప్రదేశ్‌లో సినిమాల ప్రదర్శన చుట్టూ రాజకీయాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వేసవిలో ‘వకీల్ సాబ్’ రిలీజ్ టైంలో టికెట్ల రేట్లపై నియంత్రణ తెచ్చారు. అలాగే అదనపు షోలు, బెనిఫిట్ షోలను క్యాన్సిల్ చేసి పడేశారు. టికెట్ల రేట్లు మరీ ఎక్కువేమీ లేవని, రీజనబుల్‌గానే ఉన్నాయని.. అనూహ్యంగా పెరిగిపోతున్న నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరలతో పోలిస్తే టికెట్ట రేట్లు బెటరే అని మెజారిటీ జనం అభిప్రాయపడుతున్నా ప్రభుత్వం మాత్రం మొండి పట్టుదలతో టికెట్ల రేట్లపై నియంత్రణను కొనసాగిస్తోంది.

దీనికి తోడు షోల సంఖ్యను నియంత్రించడం, బెనిఫిట్ షోలను క్యాన్సిల్ చేయడంలో ఆంతర్యం ఏంటో జనాలకు అంతు బట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సినీ అభిమానం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద హీరోల సినిమాలు రిలీజైనపుడు అభిమానుల కోసం తెల్లవారుజామునే బెనిఫిట్ షోలు వేయడం ఎప్పట్నుంచో ఉన్న ఆనవాయితీ. అభిమానులు ఈ షోలను ఎంతగా ఎంజాయ్ చేస్తారో చెప్పాల్సిన పని లేదు. ఐతే అవన్నీ ఇప్పుడు రద్దయిపోయాయి. కనీసం ఉదయానే షోలు మొదలుపెట్టుకునే అవకాశం కూడా లేకపోయింది.

ఐతే ‘వకీల్ సాబ్’ తర్వాత రెండు వారాల ముందు వరకు బెనిఫిట్ షోలు, అదనపు షోలు వేయాల్సిన అవసరం పడ్డ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. ఈ నెల రెండో తారీఖున బాలకృష్ణ సినిమా ‘అఖండ’తోనే వాటి అవసరం ఏర్పడింది. ఐతే ఆ సినిమాకు అనధికారికంగా ఏపీలో పెద్ద ఎత్తున బెనిఫిట్ షోలు పడ్డాయి. తెల్లవారుజామున అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో స్పెషల్ షోలు వేశారు. అదనపు షోలు కూడా ప్లాన్ చేసుకున్నారు. వీటి విషయంలో అధికార వర్గాలు ఏం పట్టనట్లే ఉన్నాయి సాయంత్రం వరకు. షోలు నడుస్తున్నపుడు సైలెంటుగా ఉండి రాత్రికి థియేటర్ల మీద దాడులు జరిపారు. థియేటర్లపై కఠిన చర్యలు కూడా చేపట్టినట్లు కనిపించలేదు.

కానీ ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప’ విషయంలో మాత్రం చాలా పట్టుదలతో వ్యవహరించారు. దీనికి బెనిఫిట్ షోలు, అదనపు షోలు లేవు. మల్టీప్లెక్సుల్లో సైతం షోల మీద నియంత్రణ విధించారు. పొలిటికల్‌గా చూసుకుంటే జగన్‌కు బాలయ్యే ముఖ్యమైన ప్రత్యర్థి. ఆయన సినిమా విషయంలో కాస్త చూసీ చూడనట్లు వదిలేసి.. బన్నీ సినిమాపై ప్రతాపం చూపించడమేంటో అర్థం కావడం లేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ మీద జగన్‌కున్న కోపమెలాంటిదో తెలిసిందే కానీ.. బన్నీ సినిమా విషయంలోనూ ఇంత పట్టుదలతో వ్యవహరిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఏదేమైనప్పటికీ బాలయ్యకు లేని రిస్ట్రిక్షన్స్ బన్నీకేంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.