మిగతా భాషల్లో బన్నీ ప్రభావమెంత?

పుష్ప.. పుష్ప.. పుష్ప.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తునే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్‌లో కూడా ‘పుష్ప’ భారీ స్థాయిలో రిలీజవుతోంది. అల్లు అర్జున్ సినిమాలు గతంలో మలయాళంలో అనువాదం అయ్యాయి. మంచి ఫలితాన్నందుకున్నాయి. ఇక హిందీలోనూ కొన్ని చిత్రాలను డబ్ చేసి రిలీజ్ చేశారు. మంచి స్పందనే వచ్చింది. ఐతే ఇప్పుడు ‘పుష్ప’ సంగతి వేరు.

ఒకేసారి ఐదు భాషల్లో సినిమా రిలీజవుతోంది. బన్నీకిది తొలి పాన్ ఇండియా రిలీజ్. హిందీ, తమిళం, మలయాళ భాషల్లో పేరున్న డిస్ట్రిబ్యూటర్లను ఎంచుకుని, ఆయా భాషల్లో సోషల్ మీడియా ద్వారా సినిమాను బాగా ప్రమోట్ చేసి సినిమాకు క్రేజ్ తీసుకురాగలిగారు. తమిళం, మలయాళంలో ‘పుష్ప’ పాటలు హోరెత్తించేశాయి. రెండు చోట్లా సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. నార్త్ మార్కెట్లోనూ ‘పుష్ప’కు కొంత హైప్ తీసుకురాగలిగారు.
కాకపోతే రిలీజ్ విషయంలో కొంచెం హడావుడి నెలకొంది.

ఆఫ్ లైన్ ప్రమోషన్లు లేకపోవడం ప్రతికూలమైంది. ఇది అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కొంచెం చేటు చేసినట్లు కనిపిస్తోంది. ‘పుష్ప’కు ఇతర భాషల్లో బుకింగ్స్ ఓ మోస్తరుగా ఉన్నాయి. తెలుగుతో పోలిస్తే ఇతర భాషల్లో టికెట్ల కోసం ప్రేక్షకులు ఎగబడిపోవట్లేదు. అలాగని బుకింగ్స్ తీసి పడేసేలానూ లేవు. మలయాళంలో ‘పుష్ప’కు బంపర్ క్రేజ్ కనిపిస్తోంది. షోలు పెట్టినవి పెట్టినట్లే సోల్డ్ ఔట్ అయిపోతున్నాయి. తమిళనాట బుకింగ్స్ ఓ మోస్తరుగా ఉన్నాయి.

చెన్నైలో బుకింగ్స్ ప్రస్తుతానికి సగటున 50 శాతం లోపే కనిపిస్తున్నాయి. రిలీజ్ టైంకి మేజర్ షోలకు హౌస్ ఫుల్స్ పడేలా ఉన్నాయి. కర్ణాటకలో ‘పుష్ప’ తెలుగు వెర్షన్‌కే ఎక్కువ క్రేజ్ ఉంది. కన్నడ వెర్షన్‌కు రెస్పాన్స్ అంత గొప్పగా లేదు. నార్త్ మార్కెట్లో ‘పుష్ప’కు మరీ హైప్ ఏమీ కనిపించట్లేదు. బుకింగ్స్ జస్ట్ ఓకే అన్నట్లే ఉన్నాయి. అక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో హౌస్ ఫుల్స్ పడే అవకాశాలు కనిపించడం లేదు. టాక్‌ను బట్టి సినిమాకు రెస్పాన్స్ ఉండొచ్చనిపిస్తోంది.