సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ విడుదల కాబోతోంది. ఆ మరుసటి రోజు రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ లైన్ లో ఉంది. ఈ క్రమంలో సంక్రాంతి రేసులో ఆఖరిగా జనవరి 14న శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమాకు ఇంకా రెండు రోజుల సమయం ఉందనగా లేటెస్ట్ గా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
ట్రైలర్ ఆరంభమే కమెడియన్ సత్య కామెడీతో చాలా కలర్ఫుల్గా మొదలైంది. ఆటో డ్రైవర్‌గా ఉన్న సత్య ఒక మహిళను హాస్పిటల్ లో దించి గర్భిణీల దగ్గర డబ్బులు తీసుకోను అనడం దానికి ఆమె తాను ప్రెగ్నెంట్ కాదని చెప్పే సీన్ నవ్వులు పూయిస్తోంది. ఇలాంటి ఫన్నీ సీన్స్ సినిమాలో చాలా ఉంటాయని ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చేశారు. యూత్ కి కావాల్సిన వినోదం ఇందులో పుష్కలంగా కనిపిస్తోంది.
శర్వానంద్ ఈ సినిమాలో బీటెక్ పూర్తి చేసి ఆర్కిటెక్ట్‌గా పనిచేసే యువకుడిగా కనిపిస్తున్నాడు. అతని జీవితంలోకి సంయుక్తా మీనన్ (ఎక్స్ గర్ల్ ఫ్రెండ్) తో పాటు సాక్షి వైద్య రావడం వల్ల కలిగే గందరగోళమే ఈ సినిమా కథగా అనిపిస్తోంది. ఒకే హీరో ఇద్దరి మధ్య ఎలా నలిగిపోతాడు అనే పాయింట్ మీద సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శర్వానంద్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ట్రైలర్ లో స్పష్టంగా కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే టాపిక్స్ మీద డైలాగ్స్ రాసి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం ట్రైలర్ కి మంచి ఫీల్ ఇచ్చింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. సంయుక్తా మీనన్ అలాగే సాక్షి వైద్య తమ గ్లామర్ తో సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనున్నారు.
ఏదేమైనా శర్వానంద్ తనదైన స్టైల్ లో మరో కామెడీ ఎంటర్టైనర్ తో ముందుకు వస్తున్నాడు. అసలే సంక్రాంతికి మంచి సక్సెస్ రేట్ ఉన్న హీరో. ఇక ఈ నెల 14న విడుదల కానున్న ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టడం ఖాయం. ఇతర స్టార్ సినిమాల పోటీ ఉన్నప్పటికీ ఈ మూవీ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకునేలా కనిపిస్తోంది. ట్రైలర్ అయితే ప్రస్తుతానికి మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఇక మౌత్ టాక్ ను బట్టి సినిమా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకునే అవకాశం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates