అల్లు అర్జున్‌కు ఎవరూ అక్కర్లేదు..

కొంత కాలంగా ఇమేజ్ బిల్డప్, సొంత బ్రాండింగ్ మీద అల్లు అర్జున్ బాగా శ్రద్ధ పెడుతున్నాడు. ఇంతకుముందులాగా అతను ‘మెగా’ నీడలో ఉండటానికి ఇష్టపడట్లేదు. మిగతా మెగా హీరోల్లాగా ఆ పదం వాడట్లేదు. గతంలో అభిమానుల గురించి మాట్లాడేటపుడు మెగా అభిమానులు అనేవాడు. కానీ ఈ మధ్య అల్లు ఆర్మీ అంటున్నాడు. ‘అల్లు’ ఫ్యామిలీ అనే మాట వాడకం కూడా ఎక్కువగా ఉంటోంది.

మెగాస్టార్ చిరంజీవి మీద అప్పుడప్పుడూ తన గౌరవభావాన్ని చాటుకుంటూనే.. తన సొంత ఇమేజ్ బిల్డప్ కోసం బన్నీ ప్రయత్నిస్తున్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. తన సినిమాల వేడుకలకు కూడా అతిథులను పిలవడం మానేశాడు బన్నీ. గతంలో చాలాసార్లు చిరంజీవి అతడి సినిమాల వేడుకలకు గెస్ట్‌గా రావడం తెలిసిందే. ఐతే ఇప్పుడు బన్నీ వేరే వేడుకలకు అతిథిగా వెళ్తున్నాడే తప్ప తన సినిమాల వేడుకలకు చీఫ్ గెస్ట్‌లను పిలవట్లేదు.

గత ఏడాది సంక్రాంతి టైంలో మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్తే.. బన్నీ మాత్రం ఏ గెస్ట్ లేకుండా తన సినిమా ‘అల వైకుంఠపురములో’ ఈవెంట్ చేసుకున్నాడు. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. తన సినిమాలకు తన ప్రమోషన్ చాలని.. ఎవరూ వచ్చి దానికి హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదని బన్నీ ఫీలవుతుండొచ్చు. ‘అల..’ విషయంలో తన నమ్మకం ఫలించడంతో ‘పుష్ప’ సినిమా విషయంలోనూ ఇదే ఒరవడి కొనసాగిస్తున్నాడు.

ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి, ప్రభాస్‌లతో పాటు ఓ బాలీవుడ్ హీరో కూడా ముఖ్య అతిథులుగా వస్తారని కొన్ని రోజుల కిందట మీడియాలో ఊదరగొట్టేశారు. కానీ తీరా చూస్తే ఏ గెస్ట్ లేకుండానే ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ నెల 13న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ ఈవెంట్ జరగనుంది. సంబంధిత పోస్టర్లలో ఎక్కడా ఫలానా వారు చీఫ్ గెస్ట్‌గా రాబోతన్నారన్న సమాచారం లేదు. తన సినిమాల ప్రమోషన్‌కు తనకు మించి ఎవరూ అవసరం లేదని బన్నీ బలంగా ఫిక్సయ్యాడనడానికి ఇది సూచిక.