‘అఖండ’ ఇన్ డైరెక్ట్ ఎటాక్


సినిమా అనేది చాలా శక్తిమంతమైన మాధ్యమం. బయట గంట సేపు ప్రసంగం ఇచ్చినా చూపించలేని ప్రభావాన్ని.. సినిమాలో ఒక్క డైలాగ్‌తో తీసుకురావచ్చు. సినిమాకున్న ఆకర్షణ, రీచ్ అలాంటిది. అందుకే కొందరు హీరోలు కావచ్చు.. రచయితలు కావచ్చు.. దర్శకులు కావచ్చు.. తమ రాజకీయ ఉద్దేశాలను.. లేదా ఇంకో రకమైన భావజాలాన్ని చెప్పడానికి సినిమాను వేదికగా చేసుకుంటూ ఉంటారు.

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణకు తెలుగుదేశం పార్టీతో ఉన్న బంధం దృష్ట్యా.. తన సినిమాల్లో పరోక్షంగా ప్రత్యర్థి పార్టీలపై పంచులేయడం ఆయనకు అలవాటే. ఎన్నో సినిమాలు ఇందుకు ఉదాహరణగా కనిపిస్తాయి. ఇప్పుడు ‘అఖండ’ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో కొంచెం ఘాటుగానే పొలిటికల్ పంచ్‌లు, కౌంటర్లు వేశాడు బాలయ్య. అవన్నీ ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ, ప్రభుత్వం మీదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

సినిమా ఆరంభంలోనే గొర్రెలు కసాయి వాణ్నే నమ్మి ఓటేస్తాయి అనే డైలాగ్‌తో పరోక్షంగా ఒక కౌంటర్ వేసేశాడు బాలయ్య. ఇక అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా.. పట్టిసీమ తూమా అనే డైలాగ్‌లోనూ పొలిటికల్ టచ్ ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో రాజకీయంగా జరిగిన, జరుగుతున్న చర్చ ఎలాంటిదో తెలిసిందే. మరో సన్నివేశంలో ‘‘పంచభూతాలతో పెట్టుకున్నోడు ఎవడూ బాగుపడలేదు. తునాతునకలై ముక్కలు కూడా దొరకలేదు’’ అనే డైలాగ్ కూడా ఒక ఉద్దేశంతో పెట్టిందే అన్నది స్పష్టం.

ఇంకా గుళ్లో విగ్రహాలు ఏం చేశాయిరా వాటిని కూల్చేస్తారా.. పడగొడతారా అంటూ ఆలయాల ప్రాశస్త్యం గురించి చెప్పే డైలాగ్ కూడా పొలిటికల్ కలర్ ఉన్నదే. నాకో లెక్కుంది.. నా వెనుకో మందుంది. నాకో స్వామీజీ ఉన్నాడు.. ఏదైనా చేస్తా, ఎంతైనా దోచేస్తా, పంచభూతాలను కబళిస్తా అంటే చూస్తూ ఊరుకుంటావా అన్న డైలాగ్ కూడా ఒక ఉద్దేశంతో రాసిందో అన్నది కొంచెం లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. కాకపోతే డైలాగులన్నీ ఇన్‌డైరెక్టుగానే ఉన్నాయి కాబట్టి వీటి గురించి పెద్దగా చర్చ లేదు. వివాదాలు తలెత్తలేదు.