కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ స్టార్లలో ఒకడైన పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెంది నెల రోజులు దాటింది. కానీ ఈ విషాదం నుంచి అతడి కుటుంబ సభ్యులు, అభిమానులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. అతడి మీద కన్నడిగుల ప్రేమ ఏ స్థాయిలో ఉందన్నది ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉంది. అతనెంత గొప్ప స్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడో మరణానంతరమే ప్రపంచానికి పూర్తిగా తెలిసింది. పునీత్ ఇంత మంచోడా, ఇంత గొప్పోడా అనుకుంటూ కన్నడిగులే కాదు.
వేరే భాషల వాళ్లు కూడా అయ్యో అనుకున్నారు. పునీత్ మరణించిన సమయంలో కర్ణాటకలో వీధి వీధిలో అతడి చిత్రపటాలు పూలదండలతో దర్శనమివ్వడం చూసి ఓ నటుడిపై ఇంత అభిమానమా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాయి. ఇక కన్నడ కంఠీరవ స్టేడియంలో పునీత్ పార్థివ దేహాన్ని చూసేందుకు అభిమానులు ఎలా పోటెత్తారో తెలిసిందే. లక్షల మందికి కడసారి చూపు చూసుకునే అవకాశం కల్పించినా.. ఇంకా ఎంతోమంది అవకాశం దొరక్క వెనుదిరిగారు.
కాగా రాజ్‌కుమార్ సమాధి పక్కనే పునీత్ పార్థివ దేహానికి అంత్యక్రియలు అయ్యాక కొన్ని రోజులు విరామం ఇచ్చిన కుటుంబ సభ్యులు.. తర్వాత అభిమానుల సందర్శనకు అవకాశం కల్పించారు. ఆ రోజు నుంచీ ఉదయం నుంచి సాయంత్రం వరకు విరామం లేకుండా జనాలు వస్తూనే ఉన్నారు. రోజూ వేలమంది పునీత్ సమాధిని సందర్శిస్తూనే ఉన్నారు.
నిన్నటికి పునీత్ చనిపోయి 38 రోజులు అయింది. కాగా నిన్న ఆదివారం కావడంతో పునీత్ సమాధి సందర్శనకు జనం పోటెత్తారు. తిరుమల లాంటి పెద్ద ఆలయాల్లో దర్శనానికి క్యూ లైన్లలో నిలుచున్నట్లుగా.. దాదాపు అరకిలోమీటరు దూరం జనాలు నిలబడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. నిన్న ఒక్క రోజు దాదాపు 35 వేల మంది పునీత్ సమాధిని సందర్శించారట. పునీత్ చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా ఇంతమంది అతడి సమాధి సందర్శనకు వస్తున్నారంటే అతడి మీద వారి ప్రేమ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates