షూటింగులకు అనుమతులు ఇవ్వాలని, లాక్ డౌన్ నిబంధనలకు లోబడి చిత్రీకరణలు జరుపుకుంటామని తెలుగు చిత్రసీమ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయమై.. ఇది వరకే చాలాసార్లు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో భేటీలు వేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కూడా కలుసుకుని, వినతి పత్రాలు అందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందించింది. షూటింగులకు అనుమతులు ఇస్తామని చెప్పుకొచ్చింది.
జూన్ మొదటి వారంలో షూటింగులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని అనుకున్నారు. కానీ ఇప్పటి వరకూ అలాంటి దాఖలాలు లేవు. షూటింగులకు పర్మిషన్లు ఇస్తూ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.
షూటింగులకు అనుమతి ఇచ్చే విషయంలో తెలంగాణ ప్రభుత్వం పునరాలోచనలో పడిందని, అందుకే ఈ విషయంలో ఆలస్యం చేస్తోందని టాక్. తెలంగాణలో షూటింగులకు అడ్డా హైదరాబాద్ నగరం. అక్కడే సింహ భాగం షూటింగులు జరుగుతాయి.
స్టూడియోల సెటప్పూ హైదరాబాద్‌లోనే ఉంది. అలాంటి హైదరాబాద్‌లో కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. తెలంగాణలో కంటెన్మెంట్ జోన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం కూడా హైదరాబాదే. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగులకు అనుమతి ఇచ్చి, మరింత ప్రమాదం తెచ్చుకోకూడదని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు… షూటింగులకు అనుమతి ఇచ్చినా, చాలామంది పెద్ద హీరోలు సెట్‌కి రావడానికి భయపడుతున్నారని తెలుస్తోంది.
అలాంప్పుడు చిత్రీకరణలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి ఉపయోగం ఏమిటి? అందుకే జూన్ – జులైలో అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలుస్తోంది. షూటింగులు ఆగస్టులోనే మొదలవుతాయని సమాచారం అందుతోంది. ఆగస్టులో షూటింగులు అంటే, థియేటర్లు ఓపెన్ అవ్వడానికి సెప్టెంబరు, అక్టోబరు వరకూ ఎదురు చూడాలేమో..?