పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తుల్ని గౌరవించే తీరే వేరుగా ఉంటుంది. తనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులు, కుటుంబ సభ్యుల్ని కూడా పవన్ ‘గారు’ అనే సంబోధిస్తారు. వేదికల మీద చిరంజీవి గురించి మాట్లాడేటపుడు కూడా చాలాసార్లు ‘చిరంజీవి గారు’ అనే సంబోధిస్తాడు. తనకు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ విషయంలోనూ అంతే.
తనకంటే చిన్నవాళ్ల ప్రస్తావన వచ్చినపుడు కూడా ‘గారు’ మరిచిపోడు పవన్. ఐతే పవన్ బహిరంగ వేదికల్లో మాత్రమే ఇలా మాట్లాడతాడని చాలామంది అనుకుంటారు కానీ.. మామూలుగా కూడా ఆయన అంతే అంటున్నాడు పవర్ స్టార్‌తో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నదర్శకుడు వేణు శ్రీరామ్. పవన్ ఎంత టెన్షన్లో ఉన్నా కూడా ‘గారు’ అనడం మరిచిపోడని అతను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
‘‘పవన్ కళ్యాణ్ గారి నుంచి రోజూ ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఆయన కమిట్మెంటే వేరు. చుట్టూ ఉన్న మనుషులందరినీ ఒకేలా చూడటం ఆయనలోని గొప్ప లక్షణం. కంగారులో కూడా పేరు పక్కన ‘గారు’ చేర్చడం మరిచిపోరు. సెట్లో సమయం దొరికితే అందరితో సరదాగా మాట్లాడతారు. మన గురించి అన్ని విషయాలూ తెలుసుకుంటారు. పుస్తకాలు చదువుతారా.. ఏమేం చదివారు అని అడుగుతారు’’ అని వేణు చెప్పాడు.
ఇక ‘వకీల్ సాబ్’ గురించి మాట్లాడుతూ.. దీని ఒరిజినల్ ‘పింక్’లో గొప్ప విషయం ఉందని.. ఒక మంచి మాట చెప్పాలంటే ఆ చెప్పే వాళ్లకు కూడా ఒక స్థాయి ఉండాలని.. అప్పుడు దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని.. పవన్ అలాంటి వ్యక్తే కాబట్టి సమాజంలోకి బలమైన సందేశం వెళ్తుందని ఆశిస్తున్నామని వేణు అన్నాడు. ‘వకీల్ సాబ్’ కథలో కొన్ని పరిమితులన్నాయని.. వాటిలోనే అభిమానులకు నచ్చేలా పవన్‌ను చూపించే ప్రయత్నం చేశామని వేణు తెలిపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates