ఈ ప్లానింగ్ తెలుగులో లేక‌పోయెనే

టాలీవుడ్లో ఆశించిన అవ‌కాశాలు రాని తెలుగు అమ్మాయిల‌కు కోలీవుడ్లో పెద్ద పీట వేసి వాళ్ల‌ను స్టార్ల‌ను చేయ‌డం మామూలే. అంజ‌లి, స్వాతి, శ్రీ దివ్య‌, ఆనంది.. ఇలా ఈ జాబితాలో చాలామందే క‌నిపిస్తారు. ఐతే తెలుగు హీరోలు త‌మిళంలో వెలిగిపోయిన దాఖ‌లాలు త‌క్కువే. శ‌ర్వానంద్, నాని లాంటి వాళ్ల‌కు అక్క‌డ మంచి గుర్తింపే వ‌చ్చినా వాళ్లు దాన్ని క్యాష్ చేసుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు.

విశాల్ తెలుగువాడే కానీ.. పుట్టి పెరిగింది, హీరో అయింది అక్క‌డే కాబ‌ట్టి అత‌ణ్ని తెలుగు హీరోగా ప‌రిగ‌ణించ‌లేం. ఐతే సందీప్ కిష‌న్ మాత్రం ముందు తెలుగులో హీరోగా అరంగేట్రం చేసి, ఇక్క‌డే మంచి పేరు సంపాదించి.. కొంచెం లేటుగా కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐతే తెలుగులో స‌రైన సినిమాలు చేయ‌క ఉన్న గుర్తింపునంతా పోగొట్టుకున్న సందీప్.. త‌మిళంలో అప్పుడప్పుడూ అయినా మంచి మంచి సినిమాలే చేస్తున్నాడు.

గ‌తంలో మాన‌గ‌రం (తెలుగులో న‌గ‌రం), మాయ‌వ‌న్ (ప్రాజెక్ట్ జ‌డ్), నెంజిల్ తునివిరుందాల్ (కేరాఫ్ సూర్య‌) లాంటి ఇంటెన్స్ థ్రిల్ల‌ర్ల‌తో సందీప్ త‌మిళంలో మంచి పేరు సంపాదించాడు. ఈ మ‌ధ్యే క‌సాట డ‌బార అనే మ‌రో థ్రిల్ల‌ర్ చేయ‌గా.. అది కూడా మంచి ఫ‌లితాన్నందుకుని సందీప్ ఖాతాలో మ‌రో విజ‌యాన్ని జ‌మ చేసింది.

ఇప్పుడ‌త‌ను త‌మిళంలో మైకేల్ పేరుతో మ‌రో సినిమా చేస్తున్నాడు. రంజిత్ జ‌య‌కొడి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇందులో ఇప్ప‌టికే విజ‌య్ సేతుప‌తి లాంటి మేటి న‌టుడు కీల‌క పాత్ర చేస్తుండ‌గా.. మ‌రో ముఖ్య పాత్ర కోసం గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌ను తీసుకున్నారు. ఈ కాస్టింగ్ చూస్తేనే సినిమా రేంజ్ ఏంటో అర్థ‌మ‌వుతుంది. ఈ సినిమా ప్రోమోలు వావ్ అనిపిస్తున్నాయి.

ఐతే త‌మిళంలో మంచి కాంబినేష‌న్ల‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తున్న సందీప్… తెలుగులో మాత్రం గ‌ల్లీ రౌడీ, తెనాలి రామ‌కృష్ణ లాంటి సిల్లీ సినిమాలు ఎందుకు చేస్తున్నాడో.. త‌న ప్ర‌తిభ‌కు త‌గ్గ సినిమాలు ఎందుకు సెట్ చేసుకోలేక‌పోతున్నాడో అర్థం కాని విష‌యం.