అవార్డులిమ్మంటున్న చిరు

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఇచ్చే ‘నంది’ అవార్డులను సినీ జనాలు ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావించేవారో తెలిసిందే. సినిమా విజయం సాధిస్తే ఎంత ఆనందపడేవారో.. నంది అవార్డులొస్తే దానికి మించిన ఆనందం కనిపించేది. నంది పురస్కారం సాధిస్తే దాన్ని కెరీర్లోనే గొప్ప ఘనతగా భావించేవారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోగానే పరిస్థితులు మారిపోయాయి.

సినీ పరిశ్రమకు కేంద్రమైన హైదరాబాద్ ఉన్నది తెలంగాణలో. ఐతే ఇక్కడ అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం నంది అవార్డుల గురించి ఏమీ పట్టనట్లు ఉండిపోయింది. ఒక సందర్భంలో నంది అవార్డుల గురించి విలేకరులు అడిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా తేలిక చేసి మాట్లాడారు. ఆయన ప్రభుత్వం ఈ అవార్డులను అస్సలు పట్టించుకునే పరిస్థితి లేదు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్నేళ్ల గ్యాప్ తర్వాత నంది అవార్డులను ప్రకటించింది కానీ.. అందులో పక్షపాతం ప్రదర్శించారన్న విమర్శలు రావడంతో తర్వాతి ఏడాది అవార్డులను ఆపేసింది. ఇక ఆ తర్వాత నంది పురస్కారాల ఊసే లేకపోయింది.

ప్రతి రాష్ట్రం తమ సినీ కళాకారుల ప్రతిభను గుర్తించి పురస్కారాలు అందిస్తోంది కానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినీ జనాలకు ఇందుకు నోచుకోవడం లేదు. ఒకటీ అరా వచ్చే జాతీయ అవార్డుల వైపు ఆశగా చూస్తున్నారు. ఫిలిం ఫేర్, సైమా లాంటి అవార్డులతో సంతృప్తి పడుతున్నారు. దీని పట్ల మెగాస్టార్ చిరంజీవి కొంత ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నంది అవార్డులను ఆపేయడం బాధాకరమంటూ ఒక ప్రైవేటు అవార్డుల వేడుకలో చిరు బాధ పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పురస్కారాలను సినీ కళాకారులు చాలా ప్రత్యేకంగా భావిస్తారని.. ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి.. పురస్కారాలు అందించి ప్రోత్సహించాలని ఆయన కోరారు.